ప్లాపులు తిన్నా కానీ రాజ్ తరుణ్ తగ్గట్లేదు!ప్లాపులు తిన్నా కానీ రాజ్ తరుణ్ తగ్గట్లేదు!
ప్లాపులు తిన్నా కానీ రాజ్ తరుణ్ తగ్గట్లేదు!

యువ హీరో రాజ్ తరుణ్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే వరస హిట్లతో కుమ్మేసాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ అంటూ వరస హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఎలా అయితే హిట్లు వచ్చి రైజ్ అయ్యాడో అలాగే ప్లాపులు కూడా తిని డౌన్ అయ్యాడు రాజ్ తరుణ్. కిట్టు ఉన్నాడు జాగ్రత్త యావరేజ్ గా ఆడిన సినిమా. ఆ తర్వాత నుండి రాజ్ తరుణ్ కు ప్లాపులు మొదలయ్యాయి. అంధగాడు, రాజు గాడు, లవర్, రంగుల రాట్నం అంటూ వరస ప్లాపులు రాజ్ తరుణ్ కెరీర్ ను చుట్టుముట్టేశాయి.

అయినా కానీ రాజ్ తరుణ్ ప్రస్తుతం మంచి మంచి సినిమా అవకాశాలు దక్కించుకుంటుండడం నిజంగా విశేషమే. దిల్ రాజు బ్యానర్ లో ఇంతకు ముందు చేసిన లవర్ డిజాస్టర్ అయిన విషయం తెల్సిందే. అయినా కూడా రాజ్ తరుణ్ తో కలిసి ఇద్దరి లోకం ఒకటే అంటూ మరో సినిమాను నిర్మించాడు దిల్ రాజు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈరోజు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇద్దరి లోకం ఒకటే చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ తన ఫ్యూచర్ సినిమాల గురించి అప్డేట్స్ ఇచ్చాడు. అది విన్న ఏ యంగ్ హీరోకైనా జెలసీ రావడం సహజం. ఎందుకంటే అన్నీ పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయనున్నాడు రాజ్ తరుణ్. ఇప్పటికే విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మాణంలో ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని చేస్తున్నాడు రాజ్ తరుణ్.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత డ్రీమ్ గర్ల్ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమా హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా కథా చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజ్ తరుణ్ చేసిన రంగుల రాట్నం ప్లాపైంది. పైగా శ్రీనివాస్ గవిరెడ్డి, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కూడా ప్లాపైంది. అయినా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా తీయడానికి ముందుకు రావడం విశేషమే. ఇవన్నీ కాకుండా దిల్ రాజుతో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది.

సో రాజ్ తరుణ్ వచ్చే ఏడాది ఫుల్ బిజీ అన్నమాట. ఇద్దరి లోకం ఒకటే హిట్టయితే ఈ కుర్ర హీరోకి మరిన్ని అవకాశాలు రావడం తథ్యం. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.