టాక్ ఆఫ్ ది టౌన్: రాజమౌళి అండ్ ఫ్యామిలీ, టాలెంట్ అన్ లిమిటెడ్

rajamouli and his family talent talking point in industry
rajamouli and his family talent talking point in industry

సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీలు రాజ్యమేలడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీలు ఆరేడు ఉన్నాయి. వారిలో కొంత మంది ఫ్యామిలీ పేరు వాడుకుని పైకి రావాలని చూసారు కూడా. ప్రతి ఫ్యామిలీలో కొంత మంది సక్సెస్ కాగలిగారు, కొంతమంది కాలేకపోయారు. అయితే రాజమౌళి ఫ్యామిలీ మాత్రం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాక్ అఫ్ టౌన్ అయింది. ఈ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ పేరు వాడుకోకుండా పరిచయమైనవారే. రీసెంట్ గా సుకుమార్ ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ కీరవాణి కొడుకని చెప్పకుండా తన చుట్టూ శ్రీ సింహా మూడు నెలల పాటు తిరిగాడని, తనని జాయిన్ చేసుకుని కొన్నాళ్ళు వర్క్ చేసాక కానీ కీరవాణి కొడుకని చెప్పలేదని అన్నాడంటే ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు స్వశక్తితో ఎలా ఎదగడానికి ఇష్టపడతారో అర్ధమవుతోంది.

రీసెంట్ గా కీరవాణి కొడుకులిద్దరూ మత్తు వదలరా సినిమా ద్వారా పరిచయమైన సంగతి తెల్సిందే. శ్రీ సింహా హీరోగా, కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన మత్తు వదలరా నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇద్దరి టాలెంట్ గురించి ఇండస్ట్రీ చర్చించుకుంటోంది. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంత టాలెంటెడ్ అన్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. గురించి ప్రస్తావన అవసరం లేదు. వారిద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ళు సేవలు అందించారు.

తర్వాత కీరవాణి సంగీత దర్శకుడిగా బిజీ అయ్యాక, ఆర్ధిక ఇబ్బందులకు గురైన ఆ ఫ్యామిలీ కొంత స్థిరపడింది. ఇక రాజమౌళి ఇండస్ట్రీకి వచ్చాక ఆ ఫ్యామిలీ దశ, దిశా రెండూ మారిపోయాయి. కీరవాణి భార్య శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్ గా ఎంత ప్రతిభ కలవారో ప్రభాస్, రానా వంటి వారికి బాగా తెలుసు. ఇక రాజమౌళి భార్య రమ, రాజమౌళి సినిమాలకే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కీరవాణి సోదరి ఎం ఎం శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా చాలా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసారు. అలాగే సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా తనదైన శైలి మెలోడీలకు ఫేమస్. రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. త్వరలో నిర్మాతగా మారబోతున్నాడు. ఇప్పుడు శ్రీ సింహా, కాల భైరవ వంతు వచ్చింది. ఇలా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో తమదైన శైలిలో ఎవరి రంగంలో వారు రాణిస్తున్నారు.