ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్న క్లారిటీ


ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్న క్లారిటీ
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్న క్లారిటీ

దర్శక ధీరుడు రాజమౌళి అంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే భావిస్తారంతా. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక, ఇండస్ట్రీ జనాలు కూడా రాజమౌళి సినిమాను బాగా నమ్ముతారు. జక్కన్న అంటే గురి తప్పడనే భావిస్తారు. అయితే రాజమౌళి సినిమా సక్సెస్ విషయంలో కచ్చితంగా ఉన్నా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కచ్చితంగా ఉండడు. రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా చెప్పిన డేట్ కు రాదు అని ఒక స్థాయి నమ్మకం అందరికీ వచ్చేసింది. ముందే రిలీజ్ డేట్ చెప్పినా కానీ ఎవరూ నమ్మరు. దీనిపై ఇప్పటికే బోలెడన్ని జోక్స్ జనాల్లో ఉన్నాయి. వీటిని రాజమౌళి అండ్ కో ఆస్వాదిస్తారు కూడా. అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నట్లు కనిపించాడు. ఈ చిత్రం జులై 30, 2020న విడుదలవుతుందని ఈ ఏడాది మొదట్లోనే చెప్పేసారు.

అయితే రిలీజ్ డేట్ విషయంలో మార్పు తప్పకపోవచ్చని జనాలు భవిస్తూ వచ్చారు. ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వరసగా గాయాలపాలవ్వడం, విదేశీ హీరోయిన్ సినిమా నుండి వ్వాకౌట్ చేయడంతో షెడ్యూల్స్ తారుమారవ్వడం, వివిధ భాషల్లో రిలీజ్ చేయనుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో సినిమా విడుదల తప్పదనే అంతా భావించారు. సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని ఆర్ ఆర్ ఆర్ టీమ్ అప్పట్లో ఒక అప్డేట్ ఇచ్చింది. అయితే అందులో రిలీజ్ డేట్ 2020 అని చెప్పింది కానీ జులై 30 అనే ప్రస్తావన తీసుకురాలేదు.

రీసెంట్ గా రాజమౌళి మత్తు వదలరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు వీళ్ళే ఈ సినిమాను ఏడాది పాటు తీశారు నేను ఆర్ ఆర్ ఆర్ ను రెండేళ్లు తీస్తే తప్పేంటి, ఈ సినిమా రిలీజ్ విషయం తనను అడగొద్దని చెప్పకనే చెప్పాడు. ఈ మాటలను బట్టి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తథ్యం అని తేలిపోయింది. ఇంకా రెండు నెలలు షూటింగ్ ఉండడం, పది భాషల్లో విడుదల చేసే సినిమా కావడంతో కచ్చితంగా ఆరేడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు కావాలి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.