`ఆర్ఆర్ఆర్‌`పై కూడా ఆ రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయిగా!


`ఆర్ఆర్ఆర్‌`పై కూడా ఆ రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయిగా!
`ఆర్ఆర్ఆర్‌`పై కూడా ఆ రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయిగా!

కెరీర్ ప్రారంభం నుంచి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి. `స్టూడెంట్ నెం.1` చిత్రం నుంచి `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌` వ‌ర‌కు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 12 చిత్రాలు హిట్, సూప‌ర్‌హిట్‌, బ్లాక్ బ‌స్ట‌ర్‌, పాన్ ఇండియా హిట్‌లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు.

ఈ ద‌శాబ్ద‌పు భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా ఈ సినిమా నిల‌వ‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసి టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని ప్ర‌స్తుతం ప్ర‌చారం మొద‌లైంది. సినిమా ప్రారంభంలోనే `మోట‌ర్ సైకిల్ స్టోరీస్‌` స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే ఇప్ప‌డా సినిమా కాద‌ని మ‌రో హాలీవుడ్ సినిమాకి ఇది కాపీ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సినిమాలో రామ్‌చ‌రణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొర‌మరం భీంగా న‌టిస్తున్నారు. ఒక పాత్ర నిప్పు, మ‌రో పాత్ర ఉప్పెన త‌రహాలో వుంటుంద‌ని టైటిల్ లోగో మోస్ట‌న్ పోస్ట‌ర్‌లోనే జ‌క్క‌న్న చెప్పేశాడు. అయితే ఇదే త‌ర‌హ కాన్సెప్ట్‌తో 1983లో `ఫైర్ అండ్ వాట‌ర్‌` అనే హాలీవుడ్ సినిమా వ‌చ్చింది. ఇదొక ఫాంట‌సీ అడ్వెంచ‌ర్‌. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌`లోరామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల పాత్ర‌ల్ని మ‌లిచాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఈ రూమ‌ర్‌ల‌పై రాజ‌మౌళి ఏమంటారో చూడాలి.