అందరి ప్లాన్స్ ను మార్చేసిన రాజమౌళి


అందరి ప్లాన్స్ ను మార్చేసిన రాజమౌళి
అందరి ప్లాన్స్ ను మార్చేసిన రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం స్టార్ హీరో కంటే భారీ ఇమేజ్ ఉన్న వ్యక్తి. అతని పేరు మీదే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. హీరో కూడా అవసరం లేకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి ప్రస్తుతం ఇద్దరు టాప్ హీరోలతో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ పోషించేది కొమరం భీమ్ పాత్ర. ఇక ఈ చిత్రాన్ని మొదట జులై 30న విడుదల చేద్దామనుకున్నారు. దాని ప్రకారంగా తమ తమ చిత్ర షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నారు ఇతర దర్శకులు, నిర్మాతలు.

ముఖ్యంగా అందరి టార్గెట్ వచ్చే సంక్రాంతి అయింది. ఎందుకంటే సంక్రాంతికి ఒక పెర్ఫెక్ట్ సినిమాతో వస్తే దాని ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మూడు, నాలుగు బడా చిత్రాలు, ఒకట్రెండు చిన్న చిత్రాలు వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసాయి. వీటిలో ఒకట్రెండు వాయిదా పడినా మిగతావి కచ్చితంగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడేవి. అయితే రాజమౌళి వీళ్లందరి ప్లాన్స్ పైనా నీళ్లు చల్లాడు.

ఆర్ ఆర్ ఆర్ జులై నుండి సంక్రాంతికి వాయిదా పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న వారందరూ ఇప్పుడు సమ్మర్ కు వెళ్లడమే, లేదంటే కొంచెం ముందుగా క్రిస్మస్ సీజన్ కు రావడమో చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

అంతే కాకుండా జులైకి ఆర్ ఆర్ ఆర్ వచ్చేసి ఉంటే చరణ్, ఎన్టీఆర్ లు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుండి తమ తమ తర్వాతి సినిమాలను మొదలుపెట్టేసుకుని ఉండేవారు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ రెడీ అవుతున్నా, ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ అవుతాడో తెలియని పరిస్థితి. రామ్ చరణ్ కూడా చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యే దాకా ఆ సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదు. రాజమౌళి సినిమా వల్ల ఇన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట.