రాజమౌళికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి?


Rajamouli struggling to find heroine for RRR
Rajamouli struggling to find heroine for RRR

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలితో తెలుగు జాతి గర్వించే సినిమాను అందించాడు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు గడించాడు రాజమౌళి. విదేశీ తారలు సైతం రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించారు. ఇక ఇండియాలో పరిస్థితి గురించి చెప్పేదేముంది. ఏ భాషా నటుడైనా రాజమౌళి సినిమాలో అవకాశమంటే ఎగిరిగంతేసి ఒప్పుకుంటారు. అంతటి క్రేజ్ ఉన్న రాజమౌళి, ప్రస్తుతం తన తర్వాతి సినిమా విషయంలో బాగా ఇబ్బందిపడుతున్నాడట. బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ కనిపించబోతున్నారు. ఇద్దరు ఉద్యమకారులు తమ జీవితాల్లో కొన్నేళ్లు ఎవరికీ తెలియకుండా వేరే చోట గడిపి వచ్చారు. ఆ సంవత్సరాల్లో ఏం జరిగిందనేది, ఈ ఇద్దరు ఉద్యమకారులు ఏం చేశారనేది ప్రధాన కథావస్తువుగా తీసుకుని రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రారంభించినప్పుడే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు రాజమౌళి. తన కెరీర్ లో తొలిసారి చెప్పిన డేట్ కు సినిమాను విడుదల చేయాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. అయితే అన్నీ రాజమౌళి చేతుల్లో ఉండదుగా. అదే ఇప్పుడు దర్శకధీరుడిని ఇబ్బంది పెడుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా అలియా భట్ ను, విదేశీ స్టేజ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నాడు. అలియా భట్ ఎగిరి గంతేసి ఒప్పుకోగా విదేశీ భామ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇది జరిగి దాదాపు ఆరు నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ ఆ భామకు రీప్లేస్మెంట్ దొరకలేదు. ఎంతమందిని ట్రై చేస్తున్నా ఎందుకో సెట్ అవ్వట్లేదు. అలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కు కథ ప్రకారం జోడీగా ఒక విదేశీ భామను ఎంపిక చేయాలి. అక్కడే వస్తోంది ఇబ్బంది అంతా. సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది.

అందుకని రాజమౌళి, ఆ విదేశీ హీరోయిన్ గా నటించాల్సిన అమ్మాయి తాలూకా పోర్షన్ ను పక్కనపెట్టేసి మిగతా పోర్షన్ ను షూట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడట. ఆ హీరోయిన్ దొరికాక ఆమె నటించాల్సిన సీన్ల తాలూకా షెడ్యూల్స్ ముందుకు జరిగి ఆ పాత్ర అవసరం లేని పోర్షన్స్ ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. మరి బాహుబలి వంటి సినిమాను డైరెక్ట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో ఇలా ఒక హీరోయిన్ కోసం నెలలకు నెలలు ఎదురుచూడటం అనేది విచిత్రమే.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నా కానీ ఇద్దరూ కలిసి కనిపించేది కాసేపే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.