చరణ్ విషయంలో టెన్షన్ పడుతున్న జక్కన్న


Rajamouli tension because of Ram Charan
Rajamouli tension because of Ram Charan

భారీ బడ్జెట్ సినిమాలకు సాధారణంగా ఉండే ఇబ్బంది, షూటింగ్ అనుకున్న ప్రకారం జరగదు. కొన్ని సార్లు వాయిదా వేయాల్సి వస్తుంది. అందులోనూ రాజమౌళి వంటి దర్శకుడంటే సినిమా షూటింగ్ కచ్చితంగా ఆలస్యమవుతుంది. రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి విడుదలవ్వదు అని ఒక స్థాయి భావన ప్రేక్షకులందరిలోనూ వచ్చేసింది. దీనిపై రకరకాల మీమ్స్ బాహుబలి సమయంలోనే వచ్చేశాయ్. వీటిని రాజమౌళి అండ్ కో ఎంజాయ్ చేసారు కూడా. తమపై వచ్చిన మీమ్స్ ను ఆడియో లాంచ్ లో వేసుకుని నవ్వుకున్నారు. ఇక తనే సినిమా లేట్ అవుతుందంటే అందులో డిస్కషన్ ఏముంటుంది.

అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం అసలు ఆలస్యమవ్వదని కుండబద్దలు కొట్టిన రేంజ్ లో చెప్పాడు జక్కన్న. చివరికి ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడక తప్పలేదు. ఈ ఏడాది జులై నుండి వచ్చే ఏడాది జనవరికి ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. ఈ వార్త చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద షాక్ ఇవ్వలేదు. వాళ్ళు ముందే ఈ రకమైన వార్తకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒక్కసారి ఆర్ ఆర్ ఆర్ విడుదలైతే తమ హీరోల రేంజ్ ఎలా మారిపోతుందో కూడా వారి ఊహకు అందట్లేదు.

అయితే ఈ వాయిదా వల్ల రాజమౌళికి కొత్త టెన్షన్ పట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ను అంత కాలం పాటు మరో సినిమా చేయకుండా హోల్డ్ చేయాలి. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తయ్యాక వేరే సినిమాకు కమిట్ అయినా అది ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యాకే అవ్వాలి కానీ ముందు జరగడానికి వీల్లేదు. అలా జరిగితే ఇక ఫ్యాన్స్ కు ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది అన్నది జక్కన్న ఆలోచన. అందులో కూడా ఎంతో కొంత నిజం లేకపోలేదు.

ఈ విషయంలో ఎన్టీఆర్ తో ఇబ్బంది లేదు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రం జులై లేదా ఆగస్ట్ లో మొదలవ్వొచ్చు. ఎలా చూసుకున్నా వచ్చే సంక్రాంతి లోపు ఈ సినిమా విడుదలవ్వడం అసాధ్యం. ఇబ్బంది అంతా చరణ్ తోనే. చరణ్, చిరంజీవి – కొరటాల శివ సినిమాలో 20 నిమిషాల పాత్ర చేయనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశముంది. 20 నిమిషాల పాత్ర కోసం దాదాపు నెల రోజుల కాల్ షీట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఈ సినిమా వచ్చే అవకాశముంది. మరి అందులో చరణ్ ది 20 నిమిషాల పాత్ర అంటే అదేం తక్కువ సేపు కాదు.

మరి ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఆచార్య విడుదలైతే అందులో చరణ్ చాలా సేపే కనిపిస్తాడు. ఇప్పుడు ఆ విషయంపైనే రాజమౌళి టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయమై రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో!.