రాజమౌళి ప్లానింగ్ రేంజ్ వేరు


రాజమౌళి ప్లానింగ్ రేంజ్ వేరు
రాజమౌళి ప్లానింగ్ రేంజ్ వేరు

ఎస్ ఎస్ రాజమౌళి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ఇండియా వైడ్ ఒక బ్రాండ్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తోన్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నెలకొల్పిన అంచనాలను తానే అందుకుంటూ, తిరిగి అంతకు మించిన అంచనాలను నెలకొల్పుతూ సాగిపోవడం ఒక్క రాజమౌళికే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా మోషన్ పోస్టర్ ఎవరూ ఊహించని విధంగా నిన్న విడుదల చేసారు.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయమని, కనీసం ఏదొక అప్డేట్ ఇవ్వమని ఎప్పటినుండో నెటిజన్లు కోరుతున్నారు. మార్చ్ లో ఇస్తామని చెబుతూ వస్తున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్. అయితే ఈలోగా కరోనా మహమ్మారి కమ్మేయడంతో ఉగాది పండగకున్న శోభ తగ్గింది. ఈరోజున సినిమా వాళ్ళు చాలా సినిమాల ముహుర్తాలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్, టీజర్స్ అంటూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఇదే సరైన వేదికని భావించారు. కాకపోతే కరోనా వైరస్ దేశాన్ని పట్టిపీడిస్తుండడంతో అందరూ తమ తమ అప్డేట్స్ ను వాయిదా వేసుకున్నారు.

ఇలాంటి కష్ట సమయంలో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడన్న అపవాదు వస్తుందేమోనని కొంత మంది భయపడ్డారు. అయితే రాజమౌళి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అందరూ డౌన్ అయిన కారణంగా ఊరటనివ్వడానికంటూ ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ను వదులుతున్నామని జక్కన్న పేర్కొన్నాడు. దీంతో ఎవరికీ ఆ రకమైన ఫీలింగ్ రాలేదు. రాజమౌళి చేసిన ఈ పని వల్ల ఉగాది రోజున అందరూ ఆర్ ఆర్ ఆర్ గురించే మాట్లాడుకున్నారు. అదొక్క సినిమా అప్డేట్ మాత్రమే ఉగాది రోజున ఉంది. అందుకే అంటారు ఏదైనా జక్కన్న ఆలోచనే వేరని.

రామ్ చరణ్ ను నిప్పుగా, ఎన్టీఆర్ ను నీరుగా చూపించిన విధానం నిజంగా సూపర్బ్ అంటున్నారు నెటిజన్లు. జనవరి 8 2021న ఈ చిత్రం విడుదల కానుంది.