ఇద్ద‌రు అతిర‌ధులు క‌లుస్తున్నారా?Rajini 169 with Raj Kamal international?
Rajini 169 with Raj Kamal international?

చాలా ఏళ్ల త‌రువాత `ద‌ర్బార్‌`తో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త‌లైవా ర‌జ‌నీకాంత్‌. ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తుస్తోంది. స‌క్సెస్ జోష్‌లో వున్న ర‌జ‌నీ త‌న త‌దుప‌రి చిత్రం షూటింగ్‌లో బిజీ అయిపోయారు. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ర‌జ‌నీ 168వ చిత్రం. ర‌జ‌నీతో రోబో, పేట్టా చిత్రాల్ని నిర్మించిన‌ స‌న్ పిక్చ‌ర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇదిలా వుండ‌గా ర‌జ‌నీ తాజాగా 169వ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టిన‌ట్టు తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని మాత్రం దిగ్రేట్ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్ రాజ్ క‌మ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్న‌ట్టు త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం. జూన్‌లో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

కోలీవుడ్ సినిమాకు రెండు క‌ళ్లుగా చెప్పుకునే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ దాదాపు ఇరవైఏళ్ల విరామం త‌రువాత క‌లిసి ఓ ప్రాజెక్ట్‌కు ప‌నిచేయ‌బోతుండ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించనున్న‌ట్టు త‌మిళ వ‌ర్గాల క‌థ‌నం.