రజినీకాంత్ ఒక్కడే రిపీట్ చేస్తున్నాడు.. రిజల్ట్ ఏమవుతుందో!

Rajinikanth Releasing Darbaar for Sankranthi
Rajinikanth Releasing Darbaar for Sankranthi

సంక్రాంతి సీజన్ వస్తోందంటే నాలుగైదు నెలలు ముందు నుండే తెలుగు సినిమా వాళ్ళు హంగామా మొదలుపెడతారు. తమ సినిమాలను ఎలాగైనా సంక్రాంతికి సెట్ చేయాలని చూస్తుంటారు. పోటీగా రెండు చిత్రాలు ఉన్నా సరే తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. అసలు సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. అప్పుడు సినిమా విడుదల చేస్తే కాస్త యావరేజ్ గా ఉన్నా కూడా పనైపోతుంది. కలెక్షన్లు రాబట్టేస్తాయి. అందుకే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. నవంబర్ కే తమ సినిమా రెడీ అయిపోయినా సరే రెండు నెలలు ఆగి మరీ సినిమాను విడుదల చేయాలని భావిస్తారు. తెలుగు వరకూ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేపేరు నందమూరి బాలకృష్ణ. ఇప్పటివరకూ ఎన్నిసార్లు తన సినిమాను సంక్రాంతికి విడుదల చేసాడో కూడా గుర్తులేదు. గత కొన్నేళ్ల నుండి తన సినిమా సంక్రాంతికి కచ్చితంగా విడుదల ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. కిందటి ఏడాది జై సింహా వంటి సాధారణ సినిమాతో వచ్చినా కానీ ఆ సినిమా ప్రాఫిట్స్ చూడగలిగింది అంటే సీజన్ మహాత్యమే.

అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడుతో వచ్చాడు. కంటెంట్ ఎలా ఉన్నా సినిమాను మాత్రం సీజన్ కాపాడలేకపోయింది. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి సంక్రాంతి సినిమాను లైట్ తీసుకున్నాడు. తన లేటెస్ట్ సినిమా రూలర్ ను డిసెంబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక రజినీకాంత్ ఈ ఏడాది పేట సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఓ మోస్తరు కలెక్షన్లతో పేట పర్వాలేదనిపించింది. మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా తన సినిమాను రిపీట్ చేస్తున్నాడు సూపర్ స్టార్.

మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ ను జనవరి 10న విడుదల చేస్తున్నాడు. మరి ఈసారి రజని ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. దర్బార్ తో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా కూడా విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఏవి విజయం సాధిస్తాయో చూడాలి.