క్ష‌మాప‌ణ‌ చెప్పనంటున్న త‌లైవా!

Rajinikantha refused to apologise for his statement on Periyar rally
Rajinikantha refused to apologise for his statement on Periyar rally

త‌లైవా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి పూర్తిగా రాకుండానే ఆయ‌న మాట‌లు వివాదాల్ని సృష్టిస్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌ముఖ పాత్రికేయులు చో రామ‌స్వామికి సంబంధించిన `తుగ్ల‌క్` ప‌త్రిక 50వ వార్షికోత్స‌వంలో ర‌జ‌నీ పాల్గొన్నారు. పాత్రికేయులు నిజాల‌ని మాత్ర‌మే రాయాల‌ని, అబ‌ద్ధాల‌ని ప్ర‌చారం చేయొద్ద‌ని ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌కు నిజాల‌ని నిగ్గుతేల్చే చో రామ‌స్వామి లాంటి పాత్రికేయుల అవ‌స‌రం ఎంతో వుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే వేదిక‌పై సంఘ సంస్క‌ర్త  పెరియార్ రామ‌స్వామిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట దుమారాన్ని రేపుతున్నాయి. 1971లో నిర్వ‌హించిన పెరియార్ ర్యాలీలో సీతా రాముల విగ్ర‌హాల‌ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉప‌యోగించార‌ని ఓ దిన‌ప‌త్రిక వెల్ల‌డించింద‌ని ర‌జ‌నీ పేర్కొన్నారు. దీనిపై త‌మిళ‌నాడుకు చెందిన ద్ర‌విడ పార్టీకి చెందిన కొంత మంది ర‌జ‌నీపై ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయించారు. పెరియార్‌ని ర‌జ‌నీ కించ‌పరిచార‌ని, దీనికి ఆయ‌న ప‌త్రికా ముఖంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ మొద‌లైంది.

దీనిపై సీరియ‌స్‌గా స్పందించిన ర‌జ‌నీ ఇప్ప‌టికీ త‌న స్టాండ్‌పైనే వున్నానని, త‌ను ఎలాంటి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోన‌ని తాజాగా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి ర‌జ‌నీ ఫ్యాన్స్ నుంచి విప‌రీత‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మీ స్టాండ్‌ని మార్చుకోవ‌ద్ద‌ని, ఈ విష‌యంలో మీకు తోడుగా మేమున్నామ‌ని ర‌జ‌నీ ఫ్యాన్స్ ట్విట్ట‌ర్‌లో ట్వీట్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.