దర్బార్ ను మరింత ముందుకు జరుపుతున్నారా?rajinikanths darbaar might get preponed
rajinikanths darbaar might get preponed

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటు వయసులో వరసగా సినిమాలు చేస్తూ రఫ్ఫాడిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి పేట సినిమాతో వచ్చి అలరించిన రజినీకాంత్ వచ్చే ఏడాది సంక్రాంతి దర్బార్ ను షెడ్యూల్ చేసిన విషయం తెల్సిందే. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్బార్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోందని ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. రజినీకాంత్ తమిళ్ వెర్షన్ కు ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసారు. దర్బార్ టీజర్ ను త్వరలో విడుదల చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. రజినీకాంత్ కు తమిళ మార్కెట్ తో పాటు తెలుగు మార్కెట్ కూడా అత్యంత కీలకం. సినిమా బాగుంటే ఇక్కడ 30 కోట్ల వరకూ వసూలు చేయగల స్టామినా రజినికి ఉంది. అలాగే మురుగదాస్ కూడా తెలుగులో తెల్సిన పేరు కావడంతో దర్బార్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి.

అయితే ఈ సంక్రాంతికి తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు రెండూ కూడా జనవరి 12నే విడుదల కాబోతున్నాయి. అయితే రెండు చిత్రాలకు మంచి జరుగుతుందని భావించి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఒక రోజు ముందుకు అంటే జనవరి 11న విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే దర్బార్ కు పెద్ద దెబ్బ. ఎందుకంటే జనవరి 10న విడుదలవుతున్న దర్బార్ మొదటి రెండు రోజుల్లోనే మాక్సిమం థియేటర్లలో విడుదలై పెట్టుబడిని వెనక్కు తెచ్చుకోవాలని భావిస్తోంది. ఈ చిత్రానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ స్కెచ్ వేసాడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు 11న వస్తే ఒక్కరోజు సరిపోదు కాబట్టి జనవరి 9న అంటే పండగకి ఆరు రోజుల ముందుగా దర్బార్ ను దించాలని భావిస్తున్నారు. దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా భాగం అవ్వడం విశేషం. మరి ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.