విజయ్ సినిమా ఎందుకు వదులుకున్నానా అనిపించిందట..!


rakul preet regrets not doing geetha govindam
rakul preet regrets not doing geetha govindam

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ చాలా త్వరగానే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. మొదట మిడ్ రేంజ్ హీరోలతో చేస్తూ నెమ్మదిగా టాప్ రేంజ్ హీరోల సరసనా ఆడిపాడింది. ఈ క్రమంలోనే రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలొచ్చాయి. అయితే మహేష్ తో చేసిన స్పైడర్ రకుల్ కెరీర్ ను మార్చేసిందని అనుకోవచ్చు. ఆ సినిమాతో, అందులో వేసిన క్యారెక్టర్ తో చాలానే నెగటివిటీ సంపాదించుకుంది రకుల్. అందుకే ఆ తర్వాత నుండి రకుల్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అసలు ఒక దశలో సినిమాలే లేవు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ వైపు అడుగులేసింది. తన దృష్టి కూడా బాలీవుడ్ లో సినిమా చేయడంపైనే ఉందని రకుల్ ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చింది. కానీ టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలైతే మానలేదు. అలా అని క్రేజీ ఆఫర్లు ఏం రావట్లేదు. ఇందులో రకుల్ చేసుకున్న స్వయం తప్పిదాలు కొన్ని ఉన్నాయి. బాలీవుడ్ మీద మోజుతోనో మరో కారణంతోనో ఒక సూపర్ హిట్ సినిమాను వదులుకున్నానని తెగ ఫీల్ అయిపోతోంది రకుల్.

ఇంతకీ ఆ సినిమా మరేంటో కాదు. విజయ్ దేవరకొండ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గీతా గోవిందం. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రకుల్ ను అనుకున్నాడట దర్శకుడు పరశురామ్. ఈ మేరకు అమ్మడిని సంప్రదిస్తే అప్పటికే తాను దే దే ప్యార్ దే సినిమాకు డేట్లు ఇచ్చేసానని చేయలేనని చెప్పింది అమ్మడు. దాంతో పరశురామ్ హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మికను తీసుకోవడం తెల్సిందే. ఈ సినిమా రష్మికకు ఎంతలా ఉపయోగపడిందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మికది ప్రముఖ స్థానం. ఇప్పటికే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చేస్తోన్న రష్మిక, అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే నితిన్ సరసన భీష్మలో కూడా నటిస్తోంది.ఇంకా మరికొన్ని సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. ఇలా వరస సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోంది రష్మిక మందన్న.

అందుకే ఏ అవకాశం మనల్ని ఎటు తీసుకెళ్తుందో తెలీదు అంటుంటారు. గీత గోవిందం సినిమా చేసుంటే ప్రస్తుతం రకుల్ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్నది మాత్రం వాస్తవం. గీత గోవిందం సినిమాకు ముందు విజయ్ స్టార్ హీరో కాదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అంటూ రెండు హిట్లు తన ఖాతాలో ఉన్నాయి కానీ మిడ్ రేంజ్ హీరో కూడా కాదు. అందుకే రకుల్ నో చెప్పిందా? ఏదేమైనా ఆ సినిమాకు నో చెప్పడం వల్ల తానేమి బాధపడిపోవట్లేదని రకుల్ చెప్తోంది. అయితే చాలాసార్లు ఇంత పెద్ద హిట్ సినిమాలో అవకాశం వస్తే చేయలేకపోయానే అని మాత్రం అనుకున్నానని అంటోంది. మీరు ఏదైనా సినిమాను కోల్పోయినందుకు బాధపడ్డారా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు రకుల్ పై విధంగా సమాధానమిచ్చింది.