రానానే నమ్ముకున్న రకుల్


రానానే నమ్ముకున్న రకుల్
రానానే నమ్ముకున్న రకుల్

రెండు మూడేళ్ళ క్రితం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరైనా టక్కున వచ్చే సమాధానం రకుల్ ప్రీత్ సింగ్. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ తో తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్, అనతికాలంలోనే బడా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమాలు కూడా ఎక్కువ సక్సెస్ కావడంతో త్వరగానే ఆమెను టాప్ హీరోలు కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సరసన సినిమాలు వరసగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక యంగ్ హీరోల సంగతి చెప్పేదేముంది. రామ్ నుండి మొదలుపెట్టి గోపీచంద్ వరకూ చాలా మందితో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పట్లో ఏ సినిమా అయినా ఫస్ట్ ఆప్షన్ రకుల్ ప్రీత్ ఉండేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె కాదంటేనే సినిమా వేరే హీరోయిన్ దగ్గరకి వెళ్ళేది. అయితే మహేష్ బాబుతో చేసిన స్పైడర్ ఆమె కెరీర్ ను తలకిందులు చేసేసింది. సినిమా ప్లాప్ అవ్వడం, ఆపై ఆమె క్యారెక్టర్ పై కూడా విమర్శలు రావడంతో టాలీవుడ్ లో రకుల్ సీన్ రివర్స్ అయిపోయింది.

స్పైడర్ తర్వాత ఇక్కడ రకుల్ కు సినిమాలు ఇచ్చే వాళ్లే కరువయ్యారు. ఇక్కడ ఛాన్స్ లు రాకపోవడంతో మిగతా భాషల్లో ట్రై చేసింది. బాలీవుడ్ లో ఒకట్రెండు అవకాశాలు వచ్చినా అవి ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. వేరే భాషల్లో ఛాన్స్ లు అంతంతమాత్రమే అవ్వడంతో మళ్ళీ తెలుగులోనే సీనియర్ హీరో నాగార్జున సరసన నటించడానికి సైతం సై అంది. గ్లామరస్ గా కనిపించడానికి షరతులు కూడా ఏం పెట్టుకోలేదు. ఆ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. దీంతో ఇక తనకు అవకాశాలు రావని ఫిక్స్ అయిందో ఏమో, తనకున్న మ్యానేజర్లు అందరినీ తీసేసి రానానే నమ్ముకుంది. రానా దగ్గుబాటికి క్వాన్ అనే సెలబ్రిటీ మానేజ్మెంట్ సంస్థ ఉన్న విషయం తెల్సిందే. తన కెరీర్ విషయాలన్నీ ఆ సంస్థకే అప్పగించింది రకుల్ ప్రీత్.

పలువురు నటీనటులు కెరీర్ బిల్డింగ్ లో కీలక పాత్ర పోషించిన ఈ సంస్థ తన తలరాతను మారుస్తుందని నమ్ముతోంది రకుల్. అన్ని భాషల్లోనూ ఈ సంస్థకు కాంటాక్ట్స్ ఉండడంతో తన పనైపోతుందని ఆశగా ఉంది. సీనియర్ హీరోలతో నటించడానికి కూడా రకుల్ కు అభ్యంతరం లేదు. కాకపొతే వాళ్ళ పక్కన రకుల్ మరీ లేతగా ఉంటుందని దర్శకులే కన్సిడర్ చెయ్యట్లేదు. మరి ఈ సంస్థతో ఒప్పందం తర్వాతైనా రకుల్ జాతకం మారుతుందేమో చూడాలి.