ఇస్మార్ట్ రామ్ తర్వాతి సినిమాను ప్రకటించేశాడు


ram kishore tirumala movie
ram kishore tirumala movie

వరస ప్లాపులతో సతమతమైన రామ్ కు పూరి జగన్నాథ్ జత కలిసి ఇస్మార్ట్ శంకర్ ప్రకటించారు. ఆ సమయంలో ఎవరికీ ఈ చిత్రం పైన పెద్దగా అంచనాల్లేవు. పైగా చిత్ర ప్రోమోలు విడుదలైన తర్వాత అసలు ఉన్న అంచనాలు కూడా తప్పాయి. పూరి ట్రైలర్ కట్స్ ఎప్పుడూ అలానే ఉంటాయి. వాటిని నమ్మి సినిమాపై అంచనా వేయకూడదన్న విషయం సినిమా చూసాక మరోసారి అర్ధమైంది ప్రేక్షకులకు. ఇస్మార్ట్ శంకర్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అఖండ విజయం సాధించింది. పూరి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో భారీ లాభాలు కళ్లచూసాడు. ఛార్మి కూడా నిర్మాణంలో భాగస్వామి అయింది.

ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కొట్టిన కొన్ని రోజులకే పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమాను ప్రకటించేశాడు. విజయ్ దేవరకొండతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ చిత్రం కూడా పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తారు. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత నిధి అగర్వాల్, నభా నటేష్ కూడా ఫుల్ బిజీ అయిపోయారు. పలు భారీ ఆఫర్లు వీరికి వచ్చాయి. అయితే హీరో రామ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంత వరకూ తేల్చలేదు. ఇస్మార్ట్ శంకర్ విడుదలై 100 రోజులు పూర్తయినా కూడా రామ్ ఎందుకో తన నెక్స్ట్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.

హిట్ వచ్చిన ప్రతిసారి ప్లాప్ కొట్టడం రామ్ కు అలవాటు. అందుకే ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈసారి గురి తప్పకూడదని రామ్ చాలా రోజులు ఆలోచనలతోనే గడిపేశాడు. అయితే చివరికి తన నెక్స్ట్ సినిమా ఏంటనే దానిపై ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నాడు. రామ్ తన తర్వాతి సినిమా ఒక రీమేక్. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో రామ్ నటించనున్నాడు. ఈరోజే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు చిత్ర టైటిల్ అండ్ పోస్టర్ విడుదల చేస్తారని రామ్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపాడు.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నాడు. రామ్ – కిషోర్ తిరుమల కలయికలో ఇది మూడో చిత్రం. మొదటి చిత్రం నేను శైలజ హిట్ అవ్వగా, రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ యావరేజ్ గా ఆడింది. ఈ నేపథ్యంలో మూడోసారి కలిసి చిత్రం చేయబోతున్న వీరు ఎలాంటి ఔట్పుట్ ఇస్తారో అన్నది ఆసక్తికరం. మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు.

ఇస్మార్ట్ శంకర్ లో మణిశర్మ స్వర సారధ్యంలో రూపొందిన పాటలు ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కు రిలీజ్ ముందే హైప్ రావడానికి మణిశర్మ సాంగ్స్ మేజర్ క్రెడిట్ తీసుకుంటాయి. సినిమా విజయంలో కూడా కీలక పాత్ర పోషించాయి మణిశర్మ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అందుకే రామ్ తన తర్వాతి సినిమాకు కూడా మణిశర్మనే ఎంచుకున్నాడు. స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. రేపు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయి.