`స‌రిలేరు.. `ద‌ర్శ‌కుడితో మెగా ప‌వ‌ర్‌స్టార్‌?Ram Charan and Anil Ravipudi Team up
Ram Charan and Anil Ravipudi Team up

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన చిత్రం `విన‌య విధేయ రామ‌`. బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన ఈ చిత్రం రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే అత్యంత దారుణ‌మైన ఫ్లాప్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ్‌గ‌న్ పాల్గొన‌గా రాజ‌మౌళి ప‌లు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ప్రారంభించారు. ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాడే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ కావ‌డంతో సోలోగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌నే క‌సితో వున్నార‌ట రామ్‌చ‌ర‌ణ్‌.

తాజాగా ఆయ‌న అనిల్ రావిపూడి చెప్పిన లైన్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలిసింది. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే వ‌రల్డ్ వైడ్‌గా 200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని సాధించి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో అనిల్ రావిపూడితో సినిమా చేయాల‌ని చాలా మంది స్టార్ హీరోలు అడుగుతున్నార‌ట‌. తాజాగా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌కు సంబంధించిన స్టోరీ లైన్‌ని వినిపించ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.