వెంకీ కుడుముల దశ తిరిగిపోయిందిగా!


వెంకీ కుడుముల దశ తిరిగిపోయిందిగా!
వెంకీ కుడుముల దశ తిరిగిపోయిందిగా!

ఎంటర్టైనింగ్ చిత్రాలు తీసే దర్శకులకు ఉండే మెయిన్ ప్లస్ పాయింట్ ఇదే. త్వరగా స్టార్ హీరోల దృష్టిలో పడిపోవచ్చు. చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన అనిల్ రావిపూడి, ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని సంపాదించాడు. అనిల్ రావిపూడి సినిమాలంటేనే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు స్టార్ లీగ్ లో చేరిపోయాడు. మరో టాప్ స్టార్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు.

అనిల్ కంటే ముందుగానే వెంకీ కుడుములకు కూడా స్టార్ హీరోతో పనిచేసే అవకాశం రాబోతున్నట్లు సమాచారం. ఛలో వంటి హిలేరియస్ ఎంటర్టైనర్ తో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ కుడుముల తన రెండో చిత్రం భీష్మతో కూడా సూపర్ సక్సెస్ సాధించాడు. భీష్మ ప్రస్తుతం అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. ముఖ్యంగా నితిన్ కు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హిట్ వచ్చింది. ఈ రెండు సినిమాలతో వెంకీ దశ తిరిగిపోయింది. ఇప్పుడున్న యువ దర్శకులలో మోస్ట్ వాంటెడ్ గా వెంకీ మారిపోయాడంటే అతిశయోక్తి కాదు. భీష్మ రిలీజ్ కు ముందే వెంకీ తో తర్వాతి చిత్రానికి డీల్ సెట్ చేసుకుంది యూవీ క్రియేషన్స్ సంస్థ.

ఇక యూవీలో సినిమా చేయాలని రామ్ చరణ్ కూడా ఎప్పటినుండో చూస్తున్నాడు. ఇక సమయం కలిసిరావడంతో వెంకీని పిలిచి కథలు ఏమైనా ఉంటే చెప్పమని చరణ్ అనడం, అడిగిందే తడవుగా వెంకీ చిన్న లైన్ చెప్పడం జరిగాయట. ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యేలోగా ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే కచ్చితంగా సినిమా చేద్దామని చరణ్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మూడో సినిమాతోనే టాప్ రేంజ్ లోకి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు వెంకీ. ఈ సినిమా కనుక ఓకే చేసుకుని సూపర్ హిట్ కొడితే ఇక వెంకీ టాప్ లీగ్ లోకి చేరిపోవడం ఖాయం. ఇలా తక్కువ సమయంలోనే మరో దర్శకుడు కూడా టాప్ లీగ్ అంటే అది మాములు విషయం కాదు.