రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే రూట్ లో వెళుతున్నారుగా


రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే రూట్ లో వెళుతున్నారుగా
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే రూట్ లో వెళుతున్నారుగా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ వీరుడు కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఒక కల్పిత కథగా ఆర్ ఆర్ ఆర్ ఉండనుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్న విషయం కూడా తెల్సిందే. స్వతహాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా బాగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఈ ఇద్దరు హీరోల మధ్య మాత్రం ఎప్పుడూ మంచి రాపో ఉంది.

ఇద్దరూ కలిసి ఒకే సినిమా చేస్తోన్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తున్నారు, దర్శకులను కూడా అలానే ఎంచుకుంటున్నారు. మరో మూడు నెలల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అందుకని ఇప్పటినుండే ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాతి సినిమాలు ఏమిటనే దానిపై చర్చలు కూడా నడుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా ఇమేజ్ కోరుకుంటున్నాడని అందుకనే ఆ రేంజ్ లో సినిమాలు తీస్తున్న అట్లీ లేదా ప్రశాంత్ నీల్ ఒకరితో ఎన్టీఆర్ సినిమా సినిమా చేస్తాడని కూడా అన్నారు. ఈ ఇద్దరిలో ఫస్ట్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలు ఏవీ నిజం కాదని ఎన్టీఆర్ కు అసలు ప్యాన్ ఇండియాకు వెళ్లాలనే ఆలోచనే లేదని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన వెంటనే తన ఇమేజ్ మీద పట్టున్న తెలుగు దర్శకులతోనే ఎన్టీఆర్ పనిచేయనున్నాడట. ఎన్టీఆర్ కు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివతో కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే అఫీషియల్ గా సైన్ చేసుకోలేదు కానీ కలిసి పనిచేద్దామని ఈ ఇద్దరు దర్శకులకు మాట ఇచ్చాడు ఎన్టీఆర్. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇద్దరు దర్శకులలో ఒకరితో ముందు ఒక సినిమా తర్వాత మరో దర్శకుడితో ఇంకో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

మరోవైపు రామ్ చరణ్ ఆలోచనలు కూడా ఇలానే ఉన్నాయి. గతంలో బాలీవుడ్ ప్రయత్నం చేసి దారుణంగా దెబ్బతిన్న రామ్ చరణ్, ఇప్పుడిప్పుడే అటువైపు చూసే అవకాశమే లేదు. రామ్ చరణ్ కు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివతో కమిట్మెంట్స్ ఉన్నాయి. కొరటాల శివతో అయితే శ్రీమంతుడు కన్నా ముందు నుండే సినిమా చేయాలి. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలై ఆగిపోయింది కూడా. సో, ముందుగా కొరటాల శివతో తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరికి సినిమా సెట్ అవుతుందో దాన్నిబట్టి మరో దర్శకుడితో సెట్ అవ్వని హీరో సినిమా చేస్తాడట. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చిరంజీవితో సినిమా కమిట్మెంట్ ఉంది. మరి ఈ చిక్కుముడులన్నీ మరికొద్ది నెలల్లో విడిపోనున్నాయి.