ఆర్ ఆర్ ఆర్ పై బోలెడన్ని పుకార్లు.. ఏది నిజం?


Ram Charans getup raises many doubts in RRR
Ram Charans getup raises many doubts in RRR

మొదటి నుండి ఎస్ ఎస్ రాజమౌళికి ఒక అలవాటుంది. తాను ఏ సినిమా చేసినా ముందుగానే ప్రెస్ ను పిలిచి ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతోందోనన్న క్లారిటీ ఇచ్చేస్తాడు. తన సినిమా నుండి ఏమేం ఆశించవచ్చో కూడా చూచాయిగా చెబుతాడు. ఇక సినిమా రిలీజ్ కు ముందు కథ గురించి రెండు, మూడు ముక్కల్లో తేల్చేస్తాడు. ఇలా ప్రేక్షకులను బాగా ప్రిపేర్ చేసి థియేటర్లో మ్యాజిక్ చేస్తాడు. అందుకే రాజమౌళి సినిమాలు అన్నీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాయి. రాజమౌళికి ప్లాప్ అన్నది తెలియని దర్శకుడిగా ముద్ర వేసాయి. బాహుబలికి కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగించిన రాజమౌళి.. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కొంచెం పక్కకు వేళ్ళాడేమో అని అనిపిస్తోంది.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు వెళ్ళడానికి ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా కథ గురించి ఒక ఐడియా ఇచ్చాడు జక్కన్న. 1920ల కాలంలో ఈ కథ నడుస్తుందని ఇదొక కాల్పనికతమని, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తాడని చెప్పాడు రాజమౌళి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ మొన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూస్తే మాత్రం అభిమానులకు బోలెడన్ని సందేహాలు వచ్చేశాయ్.

రామ్ చరణ్ ఇందులో మిలిటరీ కటింగ్ లో కనిపించాడు. చాలా వరకూ ప్యాంట్ లోనే దర్శనమిచ్చాడు. ఖాకీ ప్యాంట్, బెల్ట్ తో కనిపించిన చరణ్ ను చూస్తే కచ్చితంగా 1920ల కాలం నాటి గెటప్ లా అనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ లో అప్పటి పరిస్థితులు ఉంటాయని, అలాగే అల్లూరి, కొమరం భీం మళ్ళీ పుడితే ఎలా ఉంటుందన్న కథా నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ వీడియో కూడా విడుదలైతే కచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదలవ్వనున్న విషయం తెల్సిందే.