
వరుసగా వివాదాస్పద చిత్రాలని తెరపైకి తీసుకొస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా `దిశ ఎన్కౌంటర్` పేరుతో మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. షాద్‌నగర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద జరిగిన హదయవిదారణ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అభం శుభం తెలియని ఓ అమాయకురాలిని నలుగురు నరరూప రాక్షసులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్ పోసి హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే రంగంలోకి దిగి ఈ దుర్ఘటనని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ `దిశ ఎన్కౌంటర్` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని శనివారం ఉదయం 11 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
గత ఏడాది నవంబర్ 26న ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది నవంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, టీజర్‌ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్నారు.