వెబ్ సిరీస్ బాట‌ప‌ట్టిన వివాదాల ద‌ర్శ‌కుడు!


వెబ్ సిరీస్ బాట‌ప‌ట్టిన వివాదాల ద‌ర్శ‌కుడు!
వెబ్ సిరీస్ బాట‌ప‌ట్టిన వివాదాల ద‌ర్శ‌కుడు!

తెలుగులో వ‌రుస వివాదాస్ప‌ద చిత్రాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు త‌ల‌నొప్పిగా మారారు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. `ర‌క్త‌చ‌రిత్ర‌` నుంచి వ‌ర్మ ఏ సినిమా చేసినా అది వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతూ వ‌స్తోంది. వంగ‌వీటి, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో గ‌డ‌ప బిడ్డ‌లు వంటి వివాదాస్ప‌ద చిత్రాల‌తో ప్ర‌శంస‌ల కంటే విమ‌ర్శ‌ల్నే అధికంగా సొంతం చేసుకున్నారు వ‌ర్మ‌.

గ‌త కొంత కాలంగా త‌న పంథాకు భిన్నంగా సినిమాలు చేస్తూ ప‌ట్టుకోల్పోయిన రామ్‌గోపాల్‌వ‌ర్మ ప్ర‌స్తుతం `ఎంట‌ర్ ద గాళ్ డ్రాగ‌న్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇండో – చైనా న‌టీన‌లులు అత్య‌ధికంగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ వ‌ర్మ ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. దీని చిత్రీక‌ర‌ణ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అయితే దీనికి ఇంకా టైటిల్‌ని మాత్రం ఖ‌రారు చేయ‌లేదు. ఈ వెబ్ సిరీస్ ద్వారా `చంద్ర‌లేఖ‌` ఫేమ్ ఇషా కోప్పిక‌ర్ వెబ్ దునియాలోకి ఎంట‌ర‌వుతోంది.

ఈ వెబ్ సిరీస్‌తో తాము మ్యాజిక్ చేయ‌బోతున్నామ‌ని, వ‌ర్మ ఓ గ్రేట్ డైరెక్ట‌ర్ అని ఇషా కోప్పిక‌ర్ వ‌ర్మ‌ని ఆకాశానికి ఎత్తేస్తోంది. రామ్‌గోపాల్‌వ‌ర్మ మేధావి అని భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత‌మైన చిత్రాల్ని ఆయ‌న తెర‌కెక్కించి చ‌రిత్ర సృష్టించార‌ని పొగ‌డ్త‌ల్లో ముంచేసింది. ఇషా మాట‌లు విన్న వారంతా వెబ్ సిరీస్ రిలీజ్ త‌రువాత ఈ మాట‌లు అంటే బాగుంటుంద‌ని కౌంట‌ర్లేస్తున్నారు.