వర్మ మరీ దిగజారిపోతున్నాడుగా


Ram Gopal Varma worst promotions for Amma Rajyamlo Kadapa Biddalu
Ram Gopal Varma worst promotions for Amma Rajyamlo Kadapa Biddalu

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచి సినిమా అందించి చాలా ఏళ్ళు అయిపోయింది. వర్మ సినిమా అంటే ఇప్పటికీ శివ గురించే చెప్పుకోవాల్సి రావడం నిజంగా విచారకరమే. అయితే దర్శకుడిగా తనలో సత్తా అయిపోయినా ఇంకా తన సినిమాలకు క్రేజ్ తీసుకురాగల నైపుణ్యం వర్మ సొంతం. అందుకే ఇంకా దర్శకుడిగా బండి లాగగలుగుతున్నాడు. ఈ తరం వాళ్లకు వర్మ అనే దర్శకుడి స్థాయి గురించి ఎంత చెబుదామనుకున్నా కానీ ఈ మధ్య తీస్తున్న నాసిరకం సినిమాలతో ఈయనేనా ఆ సినిమాలు తీసింది అనిపిస్తున్నాడు. వరసగా చెత్త సినిమాలు తీస్తూ, బయట ప్రవర్తించే తీరుతో వర్మ తన స్థాయిని తానే ఎన్నో సార్లు తగ్గించేసుకున్నాడు. ఇంతకంటే ఇక దిగజారలేడు అన్న ప్రతిసారీ వర్మ మరింత దిగజారుతూ వెళ్తున్నాడు.

ఏదొక కాంట్రవర్సీ సబ్జెక్ట్ పట్టుకోవడం, దాన్ని ఎంత వివాదాస్పదంగా తీయాలో అంత వివాదాస్పదంగానూ తీయడం, టివి డిబేట్లలో కూర్చుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, ఇలా రామ్ గోపాల్ వర్మ దర్శకుడనే స్థాయిని ఎప్పుడో తగ్గించేసుకున్నాడు. ప్రతిసారీ నేను ఇలానే ఉంటా నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చెప్పే వర్మ, కొన్నేళ్ల నుండి మాత్రం సినిమాలకు ప్రమోషన్స్ చాలా వింతగా చేస్తున్నాడు. ట్రోల్ పేజిస్ కూడా సిగ్గుపడేలా ఉన్న ఫోటో ఎడిటింగ్స్ తో వర్మ చేస్తోన్న మూవీ ప్రచారం, ఇతనేనా శివ, రంగీలా వంటి సినిమాలను అందించింది అనేలా చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

లేటెస్ట్ గా రిలీజవుతున్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకైతే ప్రమోషన్ల రూపంలో అతి చెత్త ఫోటో ఎడిట్ లను పోస్ట్ చేస్తున్నాడు. ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా అనిపిస్తున్నాడు. జగన్, విజయసాయి రెడ్డి ఎన్నికల విజయమప్పుడు ఆనందంగా దిగిన ఫోటోను పోస్ట్ చేసి తన సినిమా కోసమే వాళ్ళు ఆనందపడుతున్నారంటూ వెనకాల టివిలో ఒక ఎడిట్ వేసి పోస్ట్ చేసాడు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పోస్ట్ చేసిన ఫోటో వేసి ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడునే ట్యాగ్ చేసి మీతో సెల్ఫీ అతనికి సెల్ఫీ దిగాలని ఉంది అంటూ పోస్ట్ చేసాడు. ఇలా సిల్లీ ఎడిట్లతో తన సినిమాకి ప్రచారం కలుగుతుందని ఆశిస్తున్నాడు వర్మ. ఇలాంటి వింత పోకడలతో వర్మను అతని డై హార్డ్ ఫ్యాన్స్ గా చెప్పుకునేవారే తిట్టుకుంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి వర్మ ఎప్పటికి మారతాడో ఏంటో. అన్నట్లు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు డిసెంబర్ 12న విడుదల కానున్న విషయం తెల్సిందే కదా.