రామ్ రెడ్ స్కెచ్ అదిరిపోయిందిగా


రామ్ రెడ్ స్కెచ్ అదిరిపోయిందిగా
రామ్ రెడ్ స్కెచ్ అదిరిపోయిందిగా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ ను అందుకున్నా కానీ తర్వాతి సినిమాను ప్రకటించడానికి చాలా నెలలు తీసుకున్నాడు. దాదాపు 4 నెలలు తర్వాత తన తర్వాతి చిత్రం రెడ్ ను ప్రకటించాడు. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన హిట్ చిత్రం తడంకు ఇది రీమేక్. అయితే ఎక్కడా దీన్ని రీమేక్ గా చెప్పట్లేదు మేకర్స్. ఇలా చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందని ఒకటి, తడం రీమేక్ అని తెలియగానే చాలా మంది ఒరిజినల్ వెర్షన్ ను చూసేస్తారు. దీని వల్ల తమ సినిమాకు ప్రేక్షకులు తగ్గిపోతారు. అందుకే చిత్ర యూనిట్ దీన్ని ఒక రీమేక్ గా ప్రకటించట్లేదు. ప్రెస్ మీట్ లో నిర్మాత సైతం ఒరిజినల్ లోని ఆత్మను మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. అందువల్ల కూడా దీన్ని రీమేక్ అనట్లేదు. ఏదైతేనేం రెడ్ చిత్ర షూటింగ్ నవంబర్ 16 నుండి మొదలవుతుంది. అలాగే ముహూర్తం రోజునే రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు రామ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతా పక్కా అనుకున్నాకే రిలీజ్ డేట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ లోకి దిగకముందే ఫుల్ హోమ్ వర్క్ జరిగిందిట. అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ డేట్ ను షూటింగ్ కూడా మొదలవకుండానే ప్రకటించేసారు.

ఏప్రిల్ 9 అంటే చాలా మంచి రిలీజ్ అనే చెప్పాలి. వేసవి చిత్రాల్లో మొదట రిలీజ్ అయిన దానికి మంచి మైలేజ్ ఉంటుంది. మరోవైపు గుడ్ ఫ్రైడే వీకెండ్ కూడా కలిసివస్తోంది. ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే కావడంతో వరసగా నాలుగు రోజులు సినిమాకు కలెక్షన్స్ బాగుంటాయి. ఆ తర్వాత వారం నుండి వేసవి సెలవులు మొదలవుతాయి కాబట్టి రెడ్ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నారు. రామ్ ఈ రిలీజ్ డేట్ కోసం పట్టుబట్టి మరీ ముందే అన్నీ సెట్ చేసుకున్నాడట. ఏప్రిల్ 9 రిలీజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని ఇప్పటినుండే టార్గెట్ సెట్ చేసుకున్నాడు. ఏవైనా చిత్రాలు విజయం సాధించాలంటే ఓపెనింగ్ చాలా ముఖ్యమని రామ్ భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు ఓపెనింగ్ అదిరిపోయింది. తొలి వీకెండ్ నాటికే ఈ చిత్రం చాలా చోట్ల సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో రెడ్ చిత్రానికి కూడా ఓపెనింగ్ బాగుండాలని ఈ రిలీజ్ డేట్ ను సెట్ చేసాడు. ఎంతైనా రామ్ ముందుచూపే వేరని ఇప్పుడు రెడ్ చిత్ర సభ్యులు మాట్లాడుకుంటున్నారు.

రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల రెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది వెల్లడించలేదు. ఇస్మార్ట్ శంకర్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. రెడ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.