ఆలస్యమవ్వడానికి కారణాలు చెప్పేసిన రామ్


Ram reveals reason behind red film announcement
Ram reveals reason behind red film announcement

ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరస ప్లాపుల నుండి బయటపడి అదిరిపోయే రీసౌండింగ్ హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎన్ని సార్లు మాస్ సినిమా చేద్దామని ప్రయత్నించినా పనవ్వని రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తో పూరి ఆ కలని నెరవేర్చాడు. ఇంత పెద్ద హిట్ కొట్టినా కానీ రామ్ తన తర్వాతి సినిమా ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. సాధారణంగా ఒక హిట్ పడ్డాక అదే జోష్ లో నెక్స్ట్ సినిమా ఏంటనేది ప్రకటించేసారు. అయితే రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తర్వాత నాలుగు నెలలు అసలు చప్పుడు చేయలేదు.

రామ్ నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ఎవరైనా అడిగినా మౌనమే వహించాడు. అయితే రామ్ నటించబోయే తర్వాతి సినిమాకి ఈరోజు ముహూర్తం జరిగింది. తమిళంలో హిట్ అయిన తడం సినిమాను రీమేక్ చేస్తున్నాడు రామ్. అయితే ఒరిజినల్ ను కొని తెలుగులో తీస్తున్న నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాత్రం ఈ చిత్రాన్ని రీమేక్ అనడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఆ చిత్రంలోని సోల్ ను మాత్రమే తీసుకుంటున్నామని, తెలుగు వారి అభిరుచులకు తగ్గ మార్పులు బాగా జరిగాయని అన్నాడు.

మరి ఒక రీమేక్ ను ప్రకటించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అని రామ్ ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమే ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్ని రోజులకే తడం రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడట. అయితే తన లుక్, టైటిల్, పోస్టర్ అన్నీ పక్కా అయ్యాకే సినిమా గురించి ప్రకటించాలని ఆగామని అంటున్నాడు రామ్. తడం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెల్సిందే. నవంబర్ 16 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది.

అన్ని షెడ్యూల్స్ ముందే పక్కాగా వేసుకోవడంతో ముహూర్తం రోజునే విడుదల తేదీ కూడా ప్రకటించేసారు. సాధారణంగా తెలుగు సినిమాలకు షూటింగ్ పూర్తయితే కానీ రిలీజ్ డేట్ చెప్పే సాహసం చేయరు. కేవలం బాలీవుడ్ లోనే ముహూర్తం నాడు రిలీజ్ డేట్ ప్రకటించే సంస్కృతి ఉంటుంది. ప్రొడక్షన్ లోకి దిగాక అంతా పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతోనే నాలుగు నెలల విరామం తీసుకున్నట్లు రామ్ చెప్తున్నాడు. చూస్తుంటే ఇదే బెస్ట్ అనిపిస్తోంది కదా. సరిగ్గా ప్లానింగ్ లేకుండా ప్రొడక్షన్ లోకి దిగిపోయి తర్వాత షెడ్యూల్స్ తారుమారై నటుల డేట్స్ దొరక్క నానా ఇబ్బందులూ పడాలి.

అన్నట్లు ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న సంగతి తెల్సిందే. రామ్ తో ఇంతకుముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలను తెరకెక్కించాడు కిషోర్ తిరుమల. మూడో చిత్రం కూడా తాను రాసుకున్న కథ పట్టుకెళ్ళగా, రామ్ తడం రీమేక్ బాధ్యతలను తన మీద పెట్టాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అయిపోయిన రామ్, రెడ్ కు కూడా సంగీతం అందించాలని కోరాడు. అయితే ఈ చిత్ర హీరోయిన్ విషయంలో ఇంకా గోప్యత పాటిస్తున్నారు.