రామ చక్కని సీత మూవీ రివ్యూ


Rama Chakkani Sita Movie Review
రామ చక్కని సీత మూవీ రివ్యూ

రామ చక్కని సీత మూవీ రివ్యూ

నటీనటులు: ఇంద్ర, సుకృత వాగ్లే, ప్రియదర్శి
దర్శకత్వం: శ్రీహర్ష మంద
నిర్మాత‌లు: జి ఎల్ ఫణికాంత్ ,శ్రీమతి విశాల లక్ష్మీ
సంగీతం: కేశవ్ కిరణ్
సినిమాటోగ్రఫర్: సన్నీ

అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి విడుదల కానుండడంతో ఈరోజు అన్నీ చిన్న సినిమాలే విడుదలయ్యాయి. ఈరోజు మొత్తం నాలుగు చిత్రాలు రిలీజవ్వగా వాటిలో చెప్పుకోదగ్గది, ప్రోమోలతో కాస్త ఆసక్తి కలిగించింది రామ చక్కని సీత చిత్రం. పేరు చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

చెప్పుకోవడానికి ఇది సాధారణ ప్రేమకథలానే అనిపిస్తుంది. బాలు (ఇంద్ర) జీవితాన్ని చాలా లైట్ గా తీసుకునే హ్యాపీ గోయింగ్ కుర్రాడు. తొలిచూపులోనే అను (సుకృత వాగ్లే)ను చూసి ప్రేమలో పడిపోతాడు. తనను లైన్లో పెట్టడం కోసం సిద్ధు అనే పేరుతో ఫోన్ లో పరిచయమవుతాడు. అంతా సజావుగా సాగుతోందన్న సమయంలో బాలు చేసింది తనకు తెలుస్తుంది. తనని బాలు మోసం చేసాడని భావించిన అను అతణ్ణి దూరం పెడుతుంది. మనస్పర్థల కారణంగా దూరమైన ఈ జంట చివరికి ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.

నటీనటులు:
మొదటి సినిమా అయినా ఇంద్ర హీరోగా ఆకట్టుకున్నాడు. బాలు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన బాగుంది. కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మంచి నటుడిగా ఎదిగే అవకాశముంది. హీరోయిన్ గా చేసిన సుకృత వాగ్లే కూడా మంచి అభినయం కనబర్చింది. సూపర్ అనలేం కానీ ఆమె పరిధి మేర బాగానే చేసింది. కమెడియన్ గా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ప్రియదర్శిగా చెప్పుకోవచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:
అవ్వడానికి చిన్న చిత్రమైనా సాంకేతిక నిపుణుల పనితీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా కెమెరా మ్యాన్ పనితనం గురించి చెప్పుకోవాలి. వైజాగ్ ఎపిసోడ్ ను తెరపై అందంగా చూపించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ అందించిన బాణీలు చాలా క్యాచీగా ఉన్నాయి. సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అయినా కూడా నిర్మాణ విలువులకు ఢోకా లేదు. దర్శకుడిగా శ్రీ హర్ష సాధారణ కథను తనదైన శైలిలో చెప్పడంలో చాలావరకు విజయవంతమయ్యాడు.

చివరిగా:
ఈరోజుల్లో చిన్న సినిమాలు విజయం సాధించాలంటే కథాబలం తప్పనిసరి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన, చాలా పల్చని కథను ఎన్నుకోవడం ఈ చిత్రానికి ప్రధాన బలహీనత. అయినా దాన్ని కప్పిపుచ్చుతూ దర్శకుడు ఈజీ గోయింగ్ కథనంతో సినిమాను ఆహ్లాదకరంగా ముందుకు నడిపాడు. అయితే మళ్ళీ క్లైమాక్స్ దగ్గర సినిమా పట్టు తప్పింది. ఇక్కడ ఇచ్చిన ముగింపు చాలా సిల్లీగా అనిపిస్తుంది.

ఏదేమైనా గానీ, ఈ వారాంతం చూడటానికి వేరే సినిమాలు లేకపోతే ది బెస్ట్ ఛాయస్ రామ చక్కని సీత. కథలో కొత్తదనం ఆశిస్తే భంగపాటు తప్పదు. ఫ్రీ మైండ్ తో వెళితే ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5

కథ పాతదే అయినా ట్రీట్మెంట్ ఆకట్టుకుంటుంది.