అభిమాని కుటుంబానికి 10 ల‌క్ష‌లు!


Ramcharan dontate 10 lakhs to mega fan noor ahmed
Ramcharan dontate 10 lakhs to mega fan noor ahmed

అభిమాన హీరో సినిమా వ‌స్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా వేరు. అలాంటి అభిమానుల కోసం హీరోలు కూడా అంతే ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు నూర్ అహ్మ‌ద్ హ‌ఠాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంట‌నే అభిమాని నూర్ అహ్మ‌ద్ ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా వుంటాన‌ని, ఆర్థికంగా కూడా చేయుత నిస్తాన‌ని మాటిచ్చి కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళ్లి నూర్ అహ్మ‌ద్ కుటుంబ స‌భ్యుల‌ని ఓదార్చి త‌ను కూడా కుటుంబానికి అండ‌గా వుంటాన‌ని మాటిచ్చి కుటుంబ స‌భ్యుల‌ని ఓదార్చిన విష‌యం తెలిసిందే. ఈ సమ‌యంలో హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అందుబాటులో లేరు. దీంతో సోమ‌వారం ఆ కుటుంబానికి 10 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించి రామ్‌చ‌ర‌ణ్ మెగా అభిమానుల ప‌ట్ల త‌న‌కున్న అంకిత భావాన్ని రుజువుచేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లో నూర్ అహ్మ‌ద్ కుటుంబాన్ని క‌లుస్తాన‌ని ప్ర‌క‌టించిన రామ్‌చ‌ర‌ణ్ ఇదే సంద‌ర్భంలో ఆ కుటుంబానికి 10 ల‌క్షలు ఆర్థిక స‌హాయం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మెగా అభిమానుల్లో నూర్ అహ్మ‌ద్ గొప్ప వ్య‌క్త‌ని కొనియాడిన రామ్‌చ‌ర‌ణ్ త‌మ కుటుంబం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల కోసం ఎన్నో సార్లు ర‌క్త‌దాన శిబిరాల్ని నిర్వ‌హించార‌ని, గ‌తంలో ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యార‌ని తెలిసి హాస్పిటల్ కి వెళ్లి ప‌రామ‌ర్శించాన‌ని, ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరాన‌ని, ఇంత‌లోనే ఆయ‌న చ‌నిపోయార‌న్న వార్త తెలిసి చ‌లించిపోయాన‌ని రామ్‌చ‌ర‌ణ్ నూర్ అహ్మ‌ద్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌డం మెగా అభిమానుల్ని క‌దిలించింది.