
రానా `బాహుబలి` తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నుంచి సినిమా అంటే ఆ స్థాయిలోనే వుంటోంది. అంచనాలు కూడా అదే స్థాయిలో వుంటున్నాయి. ప్రస్తుతం `విరాటపర్వం`లో నటిస్తున్న రానా తన `అరణ్య` మూవీ రిలీజ్ డేట్‌ని తాజాగా బుధవారం ప్రకటించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది.
విష్ణు విశాల్, శ్రియ పిల్గాంకర్, జోయా హుస్సేన్ కీలక పాత్రల్లో నటించారు. అరణ్యాన్ని, అందులో జీవించే జంతువుల్ని రక్షించాలని తపించే ఓ యువకుడి కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా మార్చి 26న విడుదల చేస్తున్నట్టు హీరో రానా బుధవారం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
లాక్డౌన్ బిఫోర్ ఈ మూవీని గత ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ లాక్డౌన్ కారణంగా పరీస్థితులు అనుకూలించకపోవడంతో విడుదల వాయిదా వేశారు. ఆ తరువాత ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ బడ్జెట్, 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి కారణాలతో మరోసారి రిలీజ్‌ని వాయిదా వేసి మార్చి 26న రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు.