రానా `విరాట‌ప‌ర్వం` స‌మ్మ‌ర్‌కే వచ్చేస్తోంది!


రానా `విరాట‌ప‌ర్వం` స‌మ్మ‌ర్‌కే వచ్చేస్తోంది!
రానా `విరాట‌ప‌ర్వం` స‌మ్మ‌ర్‌కే వచ్చేస్తోంది!

ద‌గ్గుబాటి రానా హీరోగా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనా వాహెబ్‌, ఈశ్వ‌రీరావు, సాయిచంద్ న‌టిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ డి. సురేష్‌‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లై ఫ‌స్ట్ గ్లింప్స్‌, రానా, సాయి ప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌ల ఫ‌స్ట్ లుక్‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. చేయి చేయి ప‌ట్టుకుని న‌క్స‌లైట్ గెట‌ప్‌లో సాయుధుడైన‌ రానా, లంగా ఓణీలో అచ్చ తెలుగు ప‌ల్లె ప‌డుచులా సాయి ప‌ల్ల‌వి చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

ఈ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. డా. ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న పాత్ర‌లో రానా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఉత్త‌ర తెలంగాణలో 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఎంబీమీఎస్ చ‌దివిన ఓ యువ‌కుడు డాక్ట‌ర్‌గా పనిచేస్తూ ఎందుకు గ‌న్ను ప‌ట్టాడు.. ఈ క్ర‌మంలో అత‌డు ఎదుర్కొన్న స‌వాళ్లేంటి? అనే నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.