రాశి ఖన్నా అదరగొడుతోందిగా!

రాశి ఖన్నా అదరగొడుతోందిగా!
రాశి ఖన్నా అదరగొడుతోందిగా!

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రాశి ఖన్నా. బబ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాశి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా కానీ ఇంకా రాశి కెరీర్ ముందుకు సాగలేదు. పెద్ద హీరోల దృష్టి ఈ హీరోయిన్ పై పడలేదు. గ్లామరస్ గా ఉండడంతో పాటు మంచి నటి అయినా కానీ ఎందుకనో నిర్మాతలు ఆమెకు సరైన అవకాశాలు ఇవ్వలేదు. అలా అని రాశి ఖాళీగా ఏం లేదు. తొలి సినిమా నుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో ఎన్టీఆర్ తో జై లవకుశ చేసింది. నటనకు ఆస్కారం ఉన్న తొలిప్రేమ సినిమాలోనూ నటించింది. ఇవి తనకు మంచి పేరే తీసుకొచ్చాయి కూడా.

అయితే ఈ సినిమాల మధ్యలో వరస ప్లాప్స్ రావడం రాశి కెరీర్ ను ముందుకు వెళ్లకుండా చేసేసింది. టచ్ చేసి చూడు. ఆక్సిజన్, శివమ్, హైపర్, జోరు, శ్రీనివాస కళ్యాణం వంటి ప్లాపులు ఆమె కెరీర్ స్థాయిని తగ్గించేసాయ్. అయితే 2019 రాశి కెరీర్ కు బెస్ట్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది తమిళంలో అయోగ్య (టెంపర్ రీమేక్) లో నటించింది. అది సూపర్ హిట్ అయింది కూడా. తెలుగులో అయితే వారం రోజుల వ్యవధిలో విడుదలైన రెండు సినిమాలు ఆమె కెరీర్ ను పూర్తిగా టర్న్ చేశాయని చెప్పవచ్చు. డిసెంబర్ 13న విడుదలైన వెంకీ మామ, సరిగ్గా వారం తర్వాత డిసెంబర్ 20న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమాల్లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాల్లోనూ ఆమెకు పేరున్న పాత్రలే వచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ తన పాత్రలకు తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంది రాశి. ప్రమోషన్స్ విషయంలో కూడా ఈమె నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తుంది.

ఇలా తెలుగు వచ్చి, తన డబ్బింగ్ తనే చెప్పుకునే గ్లామరస్ హీరోయిన్ ఈరోజుల్లో బాగా తగ్గిపోయారు. ఈ నేపథ్యంలో వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాల సక్సెస్ రాశి ఖన్నా కెరీర్ ను ఏ విధంగా మార్చుతుందో చూడాలి.