చరణ్ కు జోడిగా బన్నీ భామ ఫిక్స్ అయినట్టేనా?చరణ్ కు జోడిగా బన్నీ భామ ఫిక్స్ అయినట్టేనా?
చరణ్ కు జోడిగా బన్నీ భామ ఫిక్స్ అయినట్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ లుక్ కు ఇప్పటికే అందరూ ఫిదా అయిపోయారు. అలాగే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ కాకుండా రామ్ చరణ్, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా రివీలైంది.

ఇప్పటివరకూ చిరు, చరణ్ ఇద్దరూ కలిసి పలుమార్లు కనిపించినా కానీ ఏ ఒక్కరూ ప్రాధాన్యమున్న పాత్ర చేయలేదు. కేవలం కేమియోలకే పరిమితమయ్యారు. అయితే ఈసారి చరణ్ పాత్ర ఆచార్యలో చాలా ప్రాధాన్యమున్నది అని స్వయంగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించడం విశేషం. చిరు, చరణ్ ఇద్దరూ గురు శిష్యులుగా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం చరణ్ 30 రోజుల కాల్ షీట్స్ ఇవ్వనున్నాడు. షూటింగ్స్ మొదలయ్యాక పరిస్థితిని బట్టి రామ్ చరణ్ డేట్స్ కేటాయిస్తాడు. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్రకు హీరోయిన్ కూడా ఉందట.

అయితే ఆ హీరోయిన్ ఎవరా అన్న సస్పెన్స్ ఇన్నాళ్లూ కొనసాగింది. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ పక్కన ఎవరా అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇప్పుడొక ఫ్రెష్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో చరణ్ సరసన రష్మిక మందన్న అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రష్మికను ఈ విషయమై సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె ఈ భారీ అవకాశాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది చూడాలి.