రవితేజ సినిమాను ఫ్రీమేక్ అంటున్నారే!

రవితేజ సినిమాను ఫ్రీమేక్ అంటున్నారే!
రవితేజ సినిమాను ఫ్రీమేక్ అంటున్నారే!

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా క్రాక్ టీజర్ నిన్న విడుదలై అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెల్సిందే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ పవర్ఫుల్ గా ఉంటూ విక్రమార్కుడులో రవితేజను గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ కెరీర్ పరంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తన గత 4 సినిమాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. మార్కెట్ పరంగా కూడా రవితేజ పూర్తిగా డౌన్ అయిపోయాడు. తన లాస్ట్ సినిమా డిస్కో రాజా అయితే దారుణమైన పరాభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో పడ్డాడు రవితేజ.

క్రాక్ కనుక అటూ ఇటూ అయితే రవితేజ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకే క్రాక్ విషయంలో పూర్తి శ్రద్ధ పెడుతున్నాడు. టీజర్ వరకూ అయితే ఈ సినిమా ఆకట్టుకుంది. రవితేజ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అయితే క్రాక్ సినిమా ముందు తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. క్రాక్ టీమ్ వాటిని ఖండిస్తున్నట్లుగా ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అని ప్రకటించింది.

కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మాత్రం సేతుపతి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒరేయ్ అప్పిగా అని చెప్పే డైలాగ్ సేతుపతి టైపులోనే అనిపిస్తోంది. ఇక కథ బ్యాక్ డ్రాప్ పరంగా కూడా సేతుపతి ఛాయలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమా సేతుపతికి ఫ్రీమేక్ అనుకోవాలా? ఏమో సినిమా రిలీజ్ అయితే కానీ ఈ విషయం తెలిసే అవకాశం లేదు మరి.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. క్రాక్ చిత్రం మే 8న విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా రవితేజ హిట్ అందుకుంటాడా అన్నది చూడాలి.