సినిమాల ఎంపికలో మళ్ళీ స్పీడ్ పెంచిన మాస్ రాజా


సినిమాల ఎంపికలో మళ్ళీ స్పీడ్ పెంచిన మాస్ రాజా
సినిమాల ఎంపికలో మళ్ళీ స్పీడ్ పెంచిన మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా పరాజయం తర్వాత కథలు వినడం పూర్తిగా ఆపేసాడు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుని డిస్కో రాజా సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ డీసెంట్ కలెక్షన్స్ తో పర్వాలేదనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదివరకు డాన్ శీను, బలుపు వంటి చిత్రాలున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఈ ఇద్దరూ క్రాక్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మేలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

క్రాక్ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మాస్ మహారాజా తన తర్వాతి సినిమాను కూడా ప్రకటించేశాడు. తనతో వీర వంటి యావరేజ్ ఎంటర్టైనర్ ను చేసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ ను చేయబోతున్నట్లు ప్రకటించాడు. రమేష్ వర్మ ఇటీవలే రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. అది ఒక రీమేకే అయినా చిత్రాన్ని విజయవంతం చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో రవితేజ కూడా ఆఫర్ ఇచ్చాడు. ఈసారి స్ట్రైట్ సినిమానే చేస్తున్నట్లు సమాచారం. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి మార్చ్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. 2020 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా విడుదలవుతుంది. 2020లో రవితేజ మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడన్నమాట.