‘క్రాక్’ పుట్టిస్తున్న మాస్ మహారాజా

Raviteja next Crack launched in style
Raviteja next Crack launched in style

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కెరీర్ కు ఊపునిచ్చే హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొంత కాలంగా రవితేజ సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. పైగా ఆఖరి రెండు చిత్రాలు టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంథోనీ దారుణమైన ఫలితాల్ని అందించాయి. తన కెరీర్ లో ఊహించని ప్లాపులు అవి. ఆ సినిమాలు కొన్న బయ్యర్లు నిండా మునిగిపోయారు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డల్ అయిపోయింది. దాంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న రవితేజ ఒప్పుకున్న సినిమా డిస్కో రాజా. టాలెంటెడ్ దర్శకుడు, విభిన్న కథలతో మన ముందుకు వచ్చే విఐ ఆనంద్ ఈసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ ను ఎంచుకున్నాడు. కథ ఏంటి, సినిమా లైన్ ఏంటి అన్న విషయాలు పూర్తిగా సస్పెన్స్ గా మైంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక కొద్ది రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోని తొలి పాట నువ్వు నాతొ ఏమన్నావో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే.

ఎస్పీ బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, థమన్ కాంబినేషన్ వచ్చిన ఈ పాట రిట్రో ఫీల్ తో ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటతో డిస్కోరాజాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ముందు ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలని భావించినా ఆ తర్వాత ఆలోచన విరమించుకున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే రవితేజ తన తర్వాతి సినిమాను ఈ మధ్యనే ప్రకటించిన విషయం తెల్సిందే. మరోసారి పోలీస్ అవతారంలోకి మారిపోతున్నాడు మాస్ మహారాజా.

తనతో డాన్ శీను, బలుపు సినిమాలకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. పై రెండు సినిమాలు మాస్ కామెడీతో తెరకెక్కినవి కాగా ఈసారి రవితేజ సెన్సిబుల్ కథను ఎంచుకున్నాడు. గోపీచంద్ మలినేనితో చేయబోయే చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని ప్రకటించారు. రవితేజ లుక్ కూడా సీరియస్ గా అండ్ న్యాచురల్ గా ఉంది.

ఈరోజు ఈ చిత్ర ముహూర్తం కావడంతో రవితేజ ఫస్ట్ లుక్ ను టైటిల్ ను ప్రకటించారు. రవితేజ పాత్రకు అనుగుణంగా ఈ చిత్రానికి క్రాక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని ముగ్గురూ బలుపు చిత్రానికి కలిసి పనిచేసిన విషయం తెల్సిందే. ఇక ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం వహించనున్నాడు. అన్నిటికన్నా ఆకర్షించే మరొక విషయం..

ఈ చిత్రానికి డైలాగులు టాలెంటెడ్ సాయి మాధవ్ బుర్రా అందించనున్నారు. ఇటీవలే సైరాకు పదునైన సంభాషణలు అందించి శభాష్ అనిపించుకున్న సాయి మాధవ్, ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఆర్ ఆర్ ఆర్ కు సంభాషణల రచయితగా పనిచేస్తున్నారు. మరి క్రాక్ చిత్రానికి ఎటువంటి మాటలు రాస్తారో అన్నది ఆసక్తికరం. క్రాక్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. సమ్మర్ కు విడుదల చేయాలని భావిస్తున్నారు.