ఆర్డీఎక్స్ లవ్ రివ్యూఆర్డీఎక్స్ లవ్ రివ్యూ
ఆర్డీఎక్స్ లవ్ రివ్యూ

ఆర్డీఎక్స్ లవ్ రివ్యూ
నటీనటులు: తేజస్, పాయల్ రాజ్ పుత్
దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత‌లు: సి.కళ్యాణ్
సంగీతం: రధన్
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019

పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ప్రచారాస్త్రంగా ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెట్టి తీసిన సినిమా ఆర్డీఎక్స్ లవ్. ప్రోమోలతోనే ఈ సినిమా ఎలా ఉంటుందన్న క్లారిటీ ఇచ్చేసినా, ట్రైలర్ లో కేవలం స్కిన్ షో, బూతు మాటలే కాకుండా సినిమాలో ఏదో ఉందన్న హింట్ ఇచ్చారు. మరి ఆర్డీఎక్స్ లవ్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దామా.

కథ:
అలివేలు (పాయల్ రాజ్ పుత్) ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ స్కీమ్స్ కొన్నిటిని ప్రజల్లోకి తీసుకెళుతుంది. ఈ క్రమంలో తనని చూసి అట్ట్రాక్ట్ అయిన తేజస్ ను వాడుకుని సీఎంతో అపాయింట్మెంట్ సంపాదిస్తుంది. అసలు ఇంతకీ ఈ అలివేలు ఎవరు? ఆమెకు సీఎంతో పనేంటి? ఎందుకని ఆయన్ను కలవడానికి అంతలా ప్రయత్నించింది. కలిసిన తర్వాత ఏం జరిగింది అన్న మిగిలిన కథ.

నటీనటులు:
ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ పాయల్ రాజ్ పుత్. ఆమె చుట్టూనే కథ అల్లారు. అయితే పాయల్ ను తీసుకున్న మెయిన్ పర్పస్ వేరు. దానికి ఆమె 100 శాతం న్యాయం చేసింది. నటించాల్సిన కొన్ని సన్నివేశాల్లో కూడా పర్వాలేదనిపించుకుంది. విలన్ గా ఆదిత్య మీనన్ ఇంప్రెస్ చేస్తాడు. తన టాలెంట్ కు తగ్గ పాత్రలు పడట్లేదని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. నరేష్ ఉన్న కాసేపు ఎమోషనల్ చేస్తాడు. సీఎంగా బాపినీడు పర్వాలేదు. తేజస్ ఈ చిత్రంలో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
ఆర్డీఎక్స్ లవ్ లో ముందుగా ఇంప్రెస్ చేసేది సినిమాటోగ్రఫీ. పల్లెటూరు అందాల్ని చక్కగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. చిన్న బడ్జెట్ అయినా కూడా ఎక్కడా రాజీ పడకుండా చేసారు. రధన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ కాదు కానీ ఒకే అన్నట్లుగానే ఉంటాయి. ఎడిటింగ్ ఈ చిత్రానికి ఉన్న ప్రధాన మైనస్ లలో ఒకటి. ఎన్నో సెన్స్ లెస్ సీన్లు ఇందులో ఉన్నాయి. అయినా ఎడిటర్ ఎందుకు అలా వదిలేసాడో అర్ధం కాదు.

దర్శకుడు శంకర్ భాను మంచి మూల కథ ఎంచుకున్నా, దానికి తగ్గట్లుగా సీన్లు అల్లుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సేఫ్ సెక్స్, గుట్కా బ్యాన్ పై గవర్నమెంట్ స్కీమ్స్ ను ప్రమోట్ చేసే సీన్లు అయితే చిరాకు తెప్పిస్తాయి. సినిమా ఆద్యంతం ఇదే తంతు నడిచి, ఆఖరి 20 నిమిషాల్లో జస్టిఫికేషన్ ఇద్దామనుకున్నా కూడా అది ఇంప్రెసివ్ గా అనిపించదు.

చివరిగా:
సెన్సువల్ సినిమాలు తీయడం తప్పని అనలేం. అయితే వాటిని అలా తీయడానికి గల కారణాలు జస్టిఫై చేసుకోగలగాలి. కథ ప్రకారం సెన్సువల్ గా చూపించడం వేరు, సెన్సువల్ గా చూపించాలి కాబట్టి దాని ప్రకారం కథ సిద్ధం చేసుకోవడం వేరు. ఆర్డీఎక్స్ లవ్ రెండో రకానికి చెందిన కథ. గ్లామర్ ఒలకబోయడానికి హీరోయిన్ ఉంది కాబట్టి ఎలా పడితే అలా సినిమా తీసేయొచ్చు అనుకోవడం చాలా పొరబాటు. ఒక సీన్ కు మరొక సీన్ కు సంబంధం లేకుండా సాగే స్క్రీన్ ప్లే, అర్ధం పర్ధం లేని సన్నివేశాలు, వీటికితోడు భారీ డ్యూరేషన్.. ఇవన్నీ కలిపి ప్రేక్షకుడిని హింసిస్తాయి. కేవలం పాయల్ గ్లామర్ కోసమే వెళ్లాలనుకుంటే ఈ సినిమాకి వెళ్లొచ్చు. అయినా అలాంటి వాటికి సినిమాలే ఎందుకు చెప్పండి.

ఆర్డీఎక్స్ లవ్ – ప్రేక్షకుడిపై హింస బాంబు

రేటింగ్: 2/5