మహేష్, బన్నీ.. అసలు పరీక్ష మొదలయ్యేది ఇప్పుడే కదా!Real test for Sankranthi films now
Real test for Sankranthi films now

చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఒక భారీ పోటీ అటు ప్రేక్షకులకు ఇటు విశ్లేషకులకు మంచి వినోదం అందించింది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ పడడంతో సంక్రాంతి పోటీ రంజుగా సాగింది. ఈ రెండు సినిమాలు విడుదల కాక ముందు ఒకరకమైన పోటీ ఉంటే విడుదలయ్యాక మరో రకమైన పోటీ. ఒకళ్ళు సంక్రాంతి విన్నర్ అంటే మరొక్కళ్ళు సంక్రాంతి మొగుడు అంటూ ఆ తర్వాత అసలు సిసలైన విజయమంటూ పోస్టర్స్ మీద వేసుకోవడంతో పోటీ తారాస్థాయికి చేరుకుంది.

ఈ చిత్రాలకు చెందిన పీఆర్వోలు కలెక్షన్స్ ను పోస్ట్ చేయడంలో పోటీ పడ్డారు. మాది నాన్ బాహుబలి హిట్ అంటే లేదు మాది నాన్ బాహుబలి హిట్ అంటూ రెండు చిత్రాలూ పోటీ పడడం కొసమెరుపు. ఏది ఏమైనా ఈ రెండు సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హోరెత్తించాయి అన్నది మాత్రం వాస్తవం. సంక్రాంతి హాలిడేను ఫుల్లుగా వాడుకుంటూ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి.

ఈ రెండు చిత్రాలూ కూడా 100 కోట్ల షేర్ ను అవలీలగా దాటేశాయి. దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నాయి. బయ్యర్లందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ రెండిట్లో అసలు సిసలు సంక్రాంతి విజేత ఎవరు అంటే ఈరోజు నుండి తేలుతుంది అంటున్నారు విశ్లేషకులు. నిన్నటితో సంక్రాంతి సెలవులు అయిపోవడంతో ఈరోజు నుండి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏ చిత్రమైతే ఈరోజు నుండి నిలబడుతుందో అది సంక్రాంతి విజేతగా నిలిచినట్లే. అదన్నమాట సంగతి.