చిరుకి స్పందించాల్సిన అవసరమేమొచ్చిందిచిరుకి స్పందించాల్సిన అవసరమేమొచ్చింది
చిరుకి స్పందించాల్సిన అవసరమేమొచ్చింది

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అసలు రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారినా అది తన వ్యక్తిగతం అని చెప్పి ఊరుకున్నాడే కానీ ఎక్కడా రాజకీయాలపై స్పందించింది లేదు. 2014 ఎన్నికల తర్వాత చిరు సైలెంట్ అయిపోయాడు, మంత్రిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత అయితే రాజకీయాలతో తనకు ఇక సంబంధం లేదన్నట్లుగానే మాట్లాడాడు. తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆ దిశగా అభిమానులను అలరించడం చేస్తూ వచ్చాడు. ఎక్కడైనా బయట విలేకర్లతో మాట్లాడే క్రమంలో రాజకీయ ప్రస్తావన వచ్చినా ఏదో మొక్కుబడిగా మాట్లాడడం, అంతకు కాదంటే దానిపై తన అభిప్రాయం చెప్పడం తప్పితే చిరంజీవి ఎక్కడా రాజకీయాల గురించి విశ్లేషించింది లేదు.

అలాంటిది చిరు సడెన్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రపోజల్ ను సమర్ధిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే చిరు ఇలా స్పందించడాన్ని ఊహించని మెగా అభిమానులు, ఇది పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. ఎవరు చేసారో తెలీదు కానీ తాను మూడు రాజధానుల విషయంలో స్పందించింది అబద్ధం అని మరో ప్రెస్ నోట్ చిరంజీవి నుండి వచ్చినట్లుగా ఒక నోట్ వచ్చింది. దీంతో అందరిలోనూ కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అని ఎవరికీ వారు ఒక అభిప్రాయానికి రావడం మొదలెట్టారు. చిరంజీవి ఇలా స్పందించి ఉండకపోవచ్చని కాబట్టి కచ్చితంగా ముందు స్పందించింది అన్నది ఫేక్ అయి ఉంటుందని భావించారు.

అయితే తాను మూడు రాజధానుల విషయంలో స్పందించింది నిజమేనని చిరు ఈసారి వాయిస్ తో కూడిన ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. ఇక్కడ ఎవరికీ అర్ధం కాని విషయమేమిటంటే చిరుకి ఇప్పుడు రాజకీయాల విషయంలో స్పందించాల్సిన అవసరమేమొచ్చింది అని. చిరు స్పందించడం తప్పు కాదు కానీ ఇప్పటివరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి, ఎవరూ అడగకుండా తనంతట తాను ఈ విషయంలో స్పందించడం ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే కొంతమంది తనకు ఆ నిర్ణయం నచ్చింది కాబట్టి సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడాడు అంతకుమించి ఏం లేదు అంటున్నారు. మరి అసలు కారణాలు చిరుకే ఎరుక.