మహేష్ ఇక అవి చాలని ఫిక్స్ అయ్యాడు


మహేష్ ఇక అవి చాలని ఫిక్స్ అయ్యాడు
మహేష్ ఇక అవి చాలని ఫిక్స్ అయ్యాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కథల విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటున్నాడు. ఏదైనా కథ పూర్తిగా నచ్చితే కానీ ఓకే చెయ్యట్లేదు. సుకుమార్ తో సినిమాను మహేష్ రద్దు చేసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చేసాడు. ఇక ఇప్పుడు తనతో మహర్షిను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని అన్నాడు కానీ ఇప్పుడు అది హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి దాకా ఓకే అనుకున్న ఈ ప్రాజెక్ట్ కు సడెన్ గా ఏమైందా అని అందరూ వాపోయారు. అయితే దీని వెనకాల చాలా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ బాబు సినిమాలను గమనిస్తే సమాజానికి ఏదొక మెసేజ్ ఇవ్వడం చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో గ్రామాల దత్తత, వాటి అభివృద్ధి తదితర అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే ఆ మెసేజ్ జనాలకు బాగానే ఎక్కింది. భరత్ అనే నేను సినిమాలో అంతఃకరణ శుద్ధి గురించి లెక్చర్లు ఇచ్చాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మహర్షి విషయానికి వచ్చేసరికి రైతుల గురించి పెద్ద క్లాసే పీకాడు. ఈ సినిమా విషయంలో విమర్శలు వచ్చినా మహేష్ మేనియాతో మహర్షి గట్టెక్కేసింది.

సరిలేరు నీకెవ్వరు విషయంలో ఈ మెసేజ్ లను కొద్దిగా తగ్గించినా అందులో కూడా అంతర్లీనంగా దేశభక్తి గురించి క్లాస్ ఉంటుంది. దాంతో మహేష్ బాబులో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. వరసగా మెసేజ్ లను ఇస్తుండడంతో తనలో మొనాటనీ వస్తోందని ఫీలైన మహేష్ ఇక ఈ క్లాస్ లు పీకడాలు చాలు అని డిసైడ్ అయిపోయాడట. అందుకే వంశీ పైడిపల్లి మరోసారి మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో వస్తే మొహమాటం లేకుండా వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

అలా అని ఇప్పుడు వంశీని పూర్తిగా పక్కనపెట్టేయలేదు. సమ్మర్ లోపు మంచి కథతో వస్తే కచ్చితంగా చేద్దామనే అంటున్నాడు. మరి వంశీ ఎలాంటి మార్పులతో మళ్ళీ మహేష్ ను కలుస్తాడో చూడాలి.