ఎన్టీఆర్ సొంత కుంపటికి కారణమేంటి?


reason behind ntr floating production house
reason behind ntr floating production house

నిన్న ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా హల్చల్ చేసిన న్యూస్.. ఎన్టీఆర్ సొంత కుంపటి.. అదే ఎన్టీఆర్ మిగతా హీరోల తరహాలో సొంత ప్రొడక్షన్ హౌజ్ పెట్టాలని నిర్ణయించుకోవడం. నిజానికి తెలుగు హీరోలు చాలా మందికి ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నాయి. తమ కుటుంబంలో ఆల్రెడీ నిర్మాణ సంస్థలున్నా కూడా సొంత కుంపటి పెట్టుకోవడానికే ఈ హీరోలు మొగ్గు చూపడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇంట్లో రెండు ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నాయి. అయినా కానీ జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. తొలిసారి ఇప్పుడు బయట హీరోతో కూడా సినిమా చేయబోతున్నాడు. అడివి శేష్ హీరోగా తెరకెక్కనున్న మేజర్ సినిమాను మహేష్ బాబే స్వయంగా నిర్మించనుండడం విశేషం.

మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే, ఇక్కడ కూడా అంతే. అల్లు అరవింద్ వంటి ప్రముఖ నిర్మాత ఉన్నాడు. నాగబాబుకు కూడా సినిమాలు నిర్మించిన చరిత్ర ఉంది. కానీ రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీకి కొణిదెల ప్రొడక్షన్స్ అని సొంత బ్యానర్ ను స్థాపించి దానిమీదే సినిమా తీసాడు. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించడానికి చాలా మంది ముందుకొచ్చినా రిస్క్ ఎక్కువ కాబట్టే నేనే తీసుకుంటా అని చెప్పి కొణిదెల బ్యానర్ మీదే దాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడు కొరటాల శివ చేయబోయే చిరంజీవి చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగం తీసుకుంటోంది.

మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క బ్యానర్ ఉంది. మోహన్ బాబు ఎప్పటినుండో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నాడు. మంచు విష్ణుకు 24 ఫ్రేమ్స్ అనే బ్యానర్ ఉంది. మంచు లక్ష్మికి లక్ష్మి టెలీఫిల్మ్స్ పేరిట సొంత బ్యానర్ ఉంది. ఇవి చాలవన్నట్లు మంచు మనోజ్, MM ఆర్ట్స్ పేరిట ఒక బ్యానర్ ను స్థాపించాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీరి బాటలోనే సొంత బ్యానర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబంలో కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఇద్దరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ జై లవకుశ చిత్రాన్ని చేసాడు కూడా. అయినా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలని నిర్ణయించుకున్నాడు యంగ్ టైగర్. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ బ్యానర్ కు సంబంధించిన విశేషాలు తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది.

హీరోలందరూ ఇలా బ్యానర్ లు స్థాపించడానికి ప్రధాన కారణం పారితోషికం అని అంటున్నారు. మొదట 15 కోట్లు, 20 కోట్లు అంటే నిర్మాతలు బేరాలాడుతున్నారు కాబట్టి పారితోషికం రూపంలో తీసుకోకుండా ఇలా ఒక బ్యానర్ ను స్థాపించి నిర్మాణ భాగస్వామిగా ఉంటే దీనికి రెట్టింపుకు మించి పారితోషికం ముడుతోంది. మహేష్ బాబు ఇలాగే తన ప్రతీ సినిమాకి 40 కోట్లు దాకా ముడుతోంది. కేవలం రెమ్యునరేషన్ పెంచుకోవడానికే ఎన్టీఆర్ బ్యానర్ స్థాపిస్తున్నాడా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.