అనిల్ రావిపూడి సెంటిమెంట్ భలే వింతగా ఉందే!


అనిల్ రావిపూడి సెంటిమెంట్ భలే వింతగా ఉందే!
అనిల్ రావిపూడి సెంటిమెంట్ భలే వింతగా ఉందే!

తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను నమ్మని వ్యక్తులు చాలా తక్కువ మందే ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదొక సెంటిమెంట్ ను నమ్ముతుంటారు. ముఖ్యంగా దర్శకులు ఈ విషయంలో ఎక్కువ పట్టింపుతో వ్యవహరిస్తుంటారు. రాఘవేంద్ర రావు సినిమా షూటింగ్ మొదలయ్యిందంటే గెడ్డం తీసేవారు కాదు. అలాగే కోడి రామకృష్ణ తలకు ఎప్పుడూ బ్యాండ్ ఉండాల్సిందే. కొంత మంది దర్శకులకు మొదటి షాట్ దేవుడి పటం మీద పెట్టడం సెంటిమెంట్. కొందరు దర్శకులకు సినిమాలో ఏదొక చోట తాము కనిపించడం సెంటిమెంట్. నిర్మాత రామానాయుడుకు కూడా ఈ రకమైన సెంటిమెంట్ ఉండేది. తాను నిర్మించే సినిమాల్లో ఏదొక రోల్ లో ఆయన కనిపించేవారు.

అలాగే లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అనిల్ రావిపూడి చేసినవి నాలుగు సినిమాలు. అందులో నాలుగూ కూడా సూపర్ హిట్స్. మొదటి సినిమా నుండి కామెడీని ప్రధానంగా చేసుకుని, మిగతా ఎమోషన్స్ ను అలా అలా పండిస్తూ హిట్స్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేష్ బాబు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అలా సరిలేరు నీకెవ్వరు సెట్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. నిజానికి ఈ సినిమాలో తమన్నా పాట పెద్ద అవసరం లేదట. బయటకు కమర్షియల్ హంగుల కోసం అని చెబుతున్నా అసలు కారణం వేరే ఉందని అనిల్ రావిపూడి సన్నిహితులకు బాగా తెలుసు. అదే తన సెంటిమెంట్.

ఇంతకీ అనిల్ రావిపూడి సెంటిమెంట్ ఏంటి అంటే.. తన ముందు సినిమా హీరోయిన్ ను, తన తర్వాతి సినిమాలో నటింపజేయడం. అలా పటాస్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి, అందులో హీరోయిన్ గా చేసిన శృతి సోధిని తన రెండో సినిమా సుప్రీమ్ లో స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నాడు. అలాగే సుప్రీమ్ లో నటించిన రాశి ఖన్నాను, మూడో సినిమా రాజా ది గ్రేట్ లో రాశి ఖన్నా చేత చిన్న పాత్ర వేయించాడు. తుమ్మెద సాంగ్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది రాశి. అలాగే రాజా ది గ్రేట్ లో హీరోయిన్ గా చేసిన మెహ్రీన్ ను ఎఫ్ 2 లో ఒక కథానాయికగా ఎంచుకున్నాడు. అలాగే ఎఫ్ 2 లో తన గ్లామర్ తో మెప్పించిన తమన్నాను సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ సాంగ్ కోసం ఒప్పించాడు అనిల్ రావిపూడి. అదీ మ్యాటర్. అందుకని అవసరం లేకపోయినా తమన్నా కోసం ఒక సాంగ్ సందర్భాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ సాగుతోంది. ఈ సాంగ్ పూర్తైన తర్వాత మరికొన్ని సీన్స్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోనుండి రెండు పాటలను విడుదల చేసిన సంగతి తెల్సిందే.