రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??


రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??
రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. దాదాపు ఆరు నెలల నుండి ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు హీరోయిన్ ను అన్వేషిస్తున్న రాజమౌళి తాజాగా ఒలివియా మోరీస్ అనే బ్రిటిష్ స్టేజ్ నటిని ఎంచుకున్నాడు. ఈమె నాటకాలు వేయడమే తప్ప ఏ తరహా సినిమాలోనూ, వెబ్ సిరీస్ లోనూ కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఈమె పేరు మీద అసలు వికీపీడియా పేజీ కూడా లేకపోవడం గమనార్హం. ఈరోజుల్లో చిన్న చిన్న ఆర్టిస్ట్ లకు కూడా వికీపీడియా పేజీ ఉంటున్న కారణంగా మరీ ఇంత తక్కువ స్థాయి నటిని ఎన్టీఆర్ సరసన తీసుకున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుస్సా కూడా అయ్యారు. మరోవైపు ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఆర్ ఆర్ ఆర్ లో ప్రకటనకు ముందు 9 వేల మంది ఫాలోయర్స్ ఉన్న ఒలివియా అకౌంట్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా 50 వేలకు చేరుకుంది. ఈమె గురించి గూగుల్ లో కూడా తెగ వెతికేశారు. ప్రకటన వచ్చిన రోజు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీగా ఒలివియా నిలిచింది. అయితే ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే రాజమౌళి లాంటి వ్యక్తి, ఎన్టీఆర్ ను తక్కువ చేస్తాడని ఊహించలేం. తక్కువ చేయలనుకున్నా ఇలా ఎక్కడినుండో హీరోయిన్ ను తీసుకొచ్చి ఎందుకు పెడతాడు. దీని వెనకాల కారణం వేరే ఉందని తెలుస్తోంది.

రాజమౌళి రాసుకున్న జెన్నిఫర్ పాత్ర నిడివి కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ఉంటుందట. పైగా పాత్ర డిమాండ్ మేరకు ఆమెకు సంప్రదాయ నృత్యం వచ్చి ఉండాలి. సంప్రదాయ నృత్యం వచ్చిన విదేశీ నటిని పట్టుకోవడం రాజమౌళి బృందానికి చాలా కష్టమైంది. ముందుగా ఈ పాత్రకు తీసుకున్న డైజీ జోన్స్ ఈ కారణంగానే సినిమా నుండి తప్పుకుంది. ఈ కారణాలతోనే ఒలివియాను జెన్నిఫర్ పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

పైగా రాజమౌళి తీసుకున్నాడంటే అందుకు తగ్గ కారణాలు ఉండే ఉంటాయిగా. ఆ బ్రాండ్ ను నమ్మి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. పాత్ర చిన్నదైనా తనదైన శైలిలో ఎలివేట్ చేయడం రాజమౌళి స్పెషలిటీ. మరి చూద్దాం ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి పాత్రనిచ్చాడో.