విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత


red star madala rangarao passed away

80 వ దశకంలో విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి యువతలో అభ్యుదయ భావాలను పెంచి పోషించిన నటుడు మాదాల రంగారావు (70) ఈరోజు తెల్లవారు ఝామున కన్నుమూశారు . గతకొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న మాదాల రంగారావు కు ముగ్గురు సంతానం , ఇద్దరు కొడుకులు ఒక కూతురు . మాదాల రవి మాదాల రంగారావు కొడుకే ! తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని మాదాల రవి చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు .

ప్రకాశం జిల్లా మైనం పాడు గ్రామంలో 1948 మే 25న జన్మించాడు మాదాల రంగారావు . విప్లవ నటుడిగా , రెడ్ స్టార్ గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు మాదాల రంగారావు . నిర్మాతగా దాదాపు 70 చిత్రాలను నిర్మించాడు ఇక హీరోగా నటించిన పలు చిత్రాలు అప్పట్లో చరిత్ర సృష్టించాయి అలాగే విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి సరికొత్త ట్రెండ్ సృష్టించిన నటుడు మాదాల రంగారావు . యువతరం కదిలింది , మరో కురుక్షేత్రం , ఎర్ర మల్లెలు ,నవోదయం , మహా ప్రస్థానం , విప్లవ శంఖం , స్వరాజ్యం , ఎర్ర పావురాలు ,జనం మనం , తొలిపొద్దు , ప్రజా శక్తి తదితర చిత్రాలు మాదాల రంగారావు ఆణిముత్యాలు . మాదాల రంగారావు మృతికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .