పిల్లల చదువు కోసం రూ.97 లక్షల విరాళం ఇచ్చిన ప్రొఫెసర్


Retd Professor Donated Rs 97 Lakhs For Education
Retd Professor Donated Rs 97 Lakhs For Education

ఈ రోజుల్లో సమాజ సేవ చేయాలంటే అంత వీజీ కాదు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఎలాగంటే ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కోటీశ్వరులు ఉదాహరణకి ఏదైనా ఒక స్కూల్ కి ఒక పాతిక వేలు పెట్టి మంచి నీళ్లు తాగే ఫ్రిడ్జ్ ఇచ్చారు అనుకుందాం, అలా ఇచ్చి ఊరుకోరు. ఏం చేస్తారో తెలుసా….? కనీసం 100 మంది కార్యకర్తలను, అభిమానులను, స్నేహితులను వెంటేసుకుని ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ర్యాలీ చేస్తారు. ఆ తర్వాత ఇచ్చిన ఫ్రిడ్జ్ గురించి పత్రికలలో మరియు టీవీ ఛానల్స్ లో పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి మరొక 50 వేలు ఖర్చు పెడతారు. ఇంతకీ అర్థం చేసుకోవాల్సిన నిజం ఏంటంటే, చేసిన సహాయం పాతికవేలు చేసుకున్న పబ్లిసిటీ 150000.

తమ స్వార్థం కోసం కాకుండా, ఎదుటి వారికి అవసరం లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని ఈ సమాజంలో నూటికో కోటికో ఒకరిద్దరు మనుషులు ఉంటారు. వారు ఏమాత్రం స్వార్థం ఆశించకుండా సమాజానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిలో ఒకరి పశ్చిమబెంగాల్లోని మాజీ ప్రొఫెసర్ చిత్రలేఖ మల్లిక్. పశ్చిమ బెంగాల్ లోని విద్యా సంస్థల అభివృద్ధికి గాను ఆమె తనకు నెలనెలా వచ్చే యాభై వేల రూపాయల పెన్షన్ విరాళంగా ఇస్తూ వచ్చారు. 2002వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాలలో సుమారు 97 లక్షల రూపాయలు పశిమ బెంగాల్ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఆమె విరాళం ఇచ్చారు. కోల్ కతా నగరంలో ఉన్న “బాగుది” అనే ప్రాంతంలో ఒక చిన్న అపార్ట్మెంట్ లో ప్రస్తుతం ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. గతంలో ఆమె విక్టోరియా ఇనిస్టిట్యూట్ లో సంస్కృతం ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇప్పటికీ పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా చిత్రలేఖ మల్లిక్ తన వంతుగా సహాయం అందిస్తున్నారు.

గతంలో తాను ప్రొఫెసర్ గా పనిచేసిన జాదవ్ పూర్ యూనివర్సిటీ కి 50 లక్షలు విరాళం ఇచ్చానని, అదేవిధంగా తన పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించిన పండిట్ విద్భూషణ్ భట్టాచార్య జ్ఞాపకార్థం గత ఏడాది 50 లక్షల రూపాయలను వర్సిటీకి అందజేసినట్లు తెలిపారు. మొదటిసారిగా 2002లో తన పించన్ 50 వేల రూపాయలను విక్టోరియా ఇన్స్టిట్యూట్ మౌలిక వసతుల కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. అలాగే హౌరా లో ఉన్న ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కు రూ.31 లక్షలను చిత్రలేఖ మల్లిక్ ఇచ్చారు.

కులం,మతం, రాజకీయ లబ్ధికోసం జయంతులు – వర్ధంతులు వచ్చినప్పుడల్లా కపట ప్రేమ నటిస్తూ; బట్టలు బత్తాకాయలు దుప్పట్లు పంచుతూ, తాము సమాజానికి సేవ చేయడం కోసమే పుట్టామని.. పబ్లిసిటీ చేసుకునే నకిలీ మనుషులు కనీసం ఇలాంటి వాళ్ల గురించి తెలుసుకున్న తరువాత అయినా మారాలని ఆశిద్దాం.