సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా


సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా
సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా

మాజీ నటి రోజా, రాజకీయ నాయకురాలిగా ఇంత ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట ఆమెను అందరూ ఐరన్ లెగ్ అనే సంబోధించేవారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమనే ప్రచారం గట్టిగా చేసారు. ఇంకా దిగజారుడుగా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్లే వైఎస్సార్ మృతి చెందారని, అదంతా ఆమె ఐరన్ లెగ్ మహిమేనని కొంతమంది వ్యాఖ్యానించారు. టిడిపిలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఓడిపోవడం, వైఎస్సార్సీపీలోకి వచ్చాక జగన్ ఓటమి పాలు కావడంతో ఇదే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే రోజా వాటికి బెదరకుండా పట్టుదలగా ప్రయత్నించింది. 2014లో ఆమె నగరి నుండి పోటీ చేసి గెలుపొందనా టీడీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో ఆమె ప్రతిపక్షానికే పరిమితమయింది. అయితే 2019లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది. జగన్ పార్టీలో కీలక వ్యక్తి అయిన రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు.

అయితే ఆ జిల్లాలో ఉన్న సమీకరణాల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే జగన్ ఆమెను వదిలేయలేదు. ఏపీఐఐసీకి చైర్మన్ గా రోజాను నియమించారు. కీలక పదవి లభించడంతో రోజా అసంతృప్తి కొంత చల్లారినట్లే అనుకోవచ్చు. అయితే రోజా మాత్రం దీంతో సంతృప్తి పాదాలనుకోవట్లేదు. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి జిల్లాలో ఉన్న సమీకరణాలు ఒక కారణమైతే, ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలవడం మరొక కారణంగా ఆమె భావించింది. నిజానికి రోజా 2019 ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. మొదట చాలా రౌండ్లలో ఆమె వెనుకంజలోనే ఉంది. దీంతో రోజా ఓటమి ఖాయమనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా రోజా పుంజుకుని చివరికి నగరిని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో నియోజకవర్గాన్ని ఎక్కువ పట్టించుకోకపోవడమే మెజారిటీ తగ్గడానికి ఒక కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గప్రజలకు అందుబాటులో ఉండకుండా షో లు చేసుకోవడం ఏంటని అక్కడి ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోగా దానివల్లే ఆమె మెజారిటీ తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే రోజా సన్నిహిత వర్గాల్లో మరో వాదన ఉంది. 2014లో రోజా ప్రతిపక్ష పార్టీ అని, అందుకని నియోజిక అభివృద్ధికి అధికార పార్టీ నుండి సరైన సహాయ సహకారాలు అందలేదని వారు చెబుతున్నారు. ఏదేమైనా రోజా ఇప్పుడు తన స్ట్రాటజీలో మార్పు చూపిస్తోంది. జబర్దస్త్ తప్పితే మరో షో ఏదీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఇప్పటికే నగరిలో ఒక ఇల్లు తీసుకుని గృహప్రవేశం కూడా చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని భావన కలిగించడానికే ఇవన్నీ అని తెలుస్తోంది. దీంతో పాటు నియోజకవర్గంలో క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేపట్టి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని అనుకుంటోంది. జగన్ ఇప్పటికే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల వల్ల తనకు ప్రజల్లో అనుకూలత పెరిగితే అది తన మంత్రి అయ్యేందుకు అవకాశాలను పెంచుతుందని ఆశిస్తోంది. మరి రోజా అనుకున్నట్లు జరిగి మంత్రి హోదా ఆమెను వరిస్తుందా?