సైరాకు జరిగిన తప్పు ఆర్ ఆర్ ఆర్ కు కూడా రిపీట్ అవుతోందా?


సైరాకు జరిగిన తప్పు ఆర్ ఆర్ ఆర్ కు కూడా రిపీట్ అవుతోందా?
సైరాకు జరిగిన తప్పు ఆర్ ఆర్ ఆర్ కు కూడా రిపీట్ అవుతోందా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డిని ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేద్దామన్నప్పుడు దీన్ని సమ్మర్ 2019లో విడుదల చేయాలనుకున్నారు. అయితే షూటింగ్ లో జాప్యం వల్ల సైరా విడుదల సమ్మర్ కు కుదరలేదు. ఆగస్ట్ 15కి కూడా పనవ్వలేదు. కాబట్టి సైరాను దసరాకు విడుదల చేయాలనుకున్నారు. అక్టోబర్ 2న సైరా నరసింహారెడ్డి విడుదలైన విషయం తెల్సిందే. తెలుగులో చిరంజీవి సినిమా కాబట్టి పండగ రిలీజ్ ఉన్నా కానీ తమ సినిమాలను కొంత మంది నిర్మాతలు వాయిదా వేసుకున్నారు. అయితే మిగతా భాషల్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. చిరంజీవి కోసం వాయిదాలు వేసుకునే పరిస్థితి లేదు. పండగ రిలీజ్ కావడంతో ఆ అడ్వాటేంజ్ ను ఎవరూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే సైరాకు పోటీగా వేరే భాషల్లో సినిమాలు విడుదలయ్యాయి. ఆ ఎఫెక్ట్ సైరాపై గట్టిగా పడింది. ముఖ్యంగా హిందీలో సైరాకు పోటీగా విడుదలైన వార్ వసూళ్ల సునామీ సృష్టించింది. తమిళం, కన్నడలో కూడా ఇదే పరిస్థితి. పండగ రిలీజ్ కాకపోయి వుంటే ఎలాగోలా సోలో రిలీజ్ కు ట్రై చేసుకునేవాళ్ళు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే జులై 30న విడుదల అని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డేట్ ను ఎక్కడా ప్రస్తావించట్లేదు. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ జులైకి రావడం ఇక అసాధ్యం. అందుకే హిందీలో వేరే సినిమాలు ఆ డేట్ కు రిలీజ్ ను బుక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇంకా 30శాతం జరగాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కు అధిక సమయం వెచ్చించాలి. పైగా పది భాషల్లో రిలీజ్ అంటే ప్రమోషన్స్ కే దాదాపు మూడు నెలలు కావాలి. ఈ నేపథ్యంలో జులై రిలీజ్ అన్న సమస్యే లేదు. జులై 30 కే సినిమా రాలేదు అంటే ఆగష్టు 15కి కూడా అసాధ్యమే. అంటే ఆ డేట్ కూడా దాటిపోతే అనువైన డేట్ దసరా అనే చెప్పాలి. దసరాకు విడుదల చేయాలంటే సైరాకు వచ్చిన సమస్యే ఆర్ ఆర్ ఆర్ కు కూడా వస్తుంది. పది భాషల్లో రిలీజ్ కాబట్టి అన్ని భాషల్లో సోలో రిలీజ్ పండగ సమయంలో అవ్వని పని.

సోలో రిలీజ్ లేకపోతే మరీ సైరా అంత దెబ్బ పడదు కానీ ఆర్ ఆర్ ఆర్ కు అది ఎంతో కొంత నష్టం చేకూర్చేదే. ఈ నేపథ్యంలో రాజమౌళి ఏం ఆలోచిస్తున్నాడు అన్నది కీలకం. విశ్లేషకులు వచ్చే ఏడాదికి రిలీజ్ పెట్టుకోవడం ఉత్తమమని అంటున్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ విడుదల గురించి వచ్చే ఏడాదికి కానీ క్లారిటీ రాదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెల్సిందే. కీరవాణి సంగీతం అందిస్తుండగా, దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.