`Rx100` హిందీ రీమేక్ ఫస్ట్‌లుక్ వ‌చ్చేసింది!

`Rx100` హిందీ రీమేక్ ఫస్ట్‌లుక్ వ‌చ్చేసింది!
`Rx100` హిందీ రీమేక్ ఫస్ట్‌లుక్ వ‌చ్చేసింది!

ఆర్‌ఎక్స్ 100’.. కార్తీకేయ హీరోగా న‌టించిన సంచలనాత్మక చిత్రమిది. హీరోయిన్ గా న‌టించిన‌ పాయల్ రాజ్‌పుత్ కు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. దర్శకుడు అజయ్ భూపతిని రాత్రి రాత్రి స్టార్‌డమ్ ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ చేసిన తర్వాత ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. ఇప్పుడు ‘ఆర్‌ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి త‌న‌యుడు ఈ చిత్రం ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు.

నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి ‘తడప్’ అని పేరు పెట్టారు. ఈ చిత్ర  ఫస్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్‌ని ఈ రోజు ఆవిష్కరించారు.  అహన్ హీరోయిన్ తారా సుతారియాను కౌగిలించుకోవడం పోస్ట‌ర్‌లో కనిపిస్తోంది. ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అనేది టైటిల్‌కు ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ తో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయ‌ట‌.

ప్రీతమ్ సంగీతం సమకూర్చుతుండగా మిలన్ లుథ్రియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘తడప్’ విడుదల తేదీ కూడా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. సెప్టెంబర్ 24 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.  తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం ‘తడప్’గా హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.