తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని శర్మ రాజీనామా


తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని శర్మ రాజీనామా
తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ప్రజలు ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలవడంతో, ఆ పార్టీ 151 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్న గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకున్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అదే 23 స్థానాలకు పరిమితమైంది. రాజకీయ నాయకులకు మాటలు మార్చడం వేసుకున్న పార్టీ కండువాలు మార్చడం ఏమంత పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాదిరిగా, అధికార పార్టీలోకి జంప్ లు చేయడం కుదరడం లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి తన పార్టీలోకి చేయదలుచుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, లేదా ఇతర పదవులు అనుభవిస్తున్న నాయకులకు ఆ పదవులు రాజీనామా చేసి, తమ పార్టీలోకి రమ్మని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జగన్ ది అదే మాట.

కాబట్టి చాలామంది ఇతర రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ పునరావాసం కోసం చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తను స్వదస్తూరితో రాసిన లేఖను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరంగా బాగున్నా, అంతర్గతంగా ఎన్నో లోపాలు ఉన్నాయని, తాను బయటకు చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు పడ్డానని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనకు ఇంతకాలం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరేది, ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాధినేని యామిని శర్మ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పదవిలో చేరబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ సాధించుకోవడమే లక్ష్యంగా సాధినేని యామిని శర్మ తన రాజకీయ కార్యాచరణ ప్రారంభించారని ఆమె సన్నిహిత వర్గాల భోగట్టా.