సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు ఆ రోజు పండ‌గే!


సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు ఆ రోజు పండ‌గే!
సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు ఆ రోజు పండ‌గే!

వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ ప‌రంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు యంగ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం త‌న పేరుతోని ధ‌ర‌మ్‌ని ప‌క్క‌న పెట్టి సాయితేజ్‌గా మార‌డంతో అత‌ని ఫేట్‌ మారింది. పేరు మార్చుకుని సాయితేజ్ చేసిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి` మంచి విజ‌యాన్ని అందించి కొత్త ఆశ‌లు చిగురింప‌జేసింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ జోష్‌తో వున్న సాయితేజ్ `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో స‌క్సెస్‌కు రెడీ అయిపోతున్న‌రు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఫిలిం స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `శ‌త‌మానం భ‌వ‌తి` త‌ర‌హాలో ట్రీమ్‌మెంట్ నేప‌థ్యంలో బంధాలు, అనుబంధాల మేళ‌వింపుతో హృద్య‌మైన కుటుంబ క‌థా చిత్రంగా ఈ సినిమా వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. స‌త్య‌రాజ్ పాత్ర ఇందులో తాత‌గా క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న పాత్ర చుట్టూ ఈ చిత్ర క‌థ తిరుగుతుంది. క్యాన్స‌ర్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ఆయ‌న‌కు త‌న వాళ్ల‌ని చూడాల‌నుకుంటారు. అయితే ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా వుండ‌టంతో అది కుద‌ర‌దంట‌.

ఆ స‌మ‌యంలో మ‌న‌వ‌డు సాయితేజ్ వ‌చ్చి తాత‌తో ఆడీపాడి సంతోష‌ప‌రుస్తాడ‌ట‌. ఈ క్ర‌మంలో తాతా మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, స‌ర‌దాలు, సెంటిమెంట్ ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూనే కంట‌త‌డి పెట్టిస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో మాన‌వీయ విలువ‌ల్ని చాటి చెప్పే చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన ఈ చిత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు మంచి విజ‌యాన్ని అందించ‌డం ఖాయ‌మ‌ని, ఈ నెల 20 సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు పండ‌గే అని ఫిలిం స‌ర్కిల్స్ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.