ధరమ్ ని దూరం చేస్తే సక్సెస్ దగ్గరవుతుందా?


sai dharam tej leaves out dharam from his name
sai dharam tej leaves out dharam from his name

మెగా ఫ్యామిలీ నుండి అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ చాలా ప్రామిసింగ్ గా కనిపించాడు. నటనలో చలాకీతనం, డ్యాన్స్ లో ఈజ్, కామెడీ టైమింగ్ ఇలా చాలా విషయాల్లో మావయ్య చిరంజీవిని గుర్తుతెచ్చినా చాలా త్వరగా తనదైన శైలిని అందుకున్నాడు. తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత రేయ్ ప్లాప్ అయినా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాల విజయాలతో మిడ్ రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ గా అనిపించాడు. అయితే అక్కడినుండి కథల ఎంపికలో చేసిన పొరబాట్లు కావొచ్చు, మరొకటో కావొచ్చు, సాయి ధరమ్ తేజ్ వరసపెట్టి ప్లాపులు అందుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను ప్లాపులు సాయి ధరమ్ తేజ్ ను ఇబ్బంది పెట్టాయి. వీటి తర్వాత చేసిన చిత్రలహరి సినిమా తేజ్ కు కొంత ఊరటనిచ్చింది. ఈ సినిమాను సూపర్ హిట్ అనలేం కానీ మొత్తానికి తేజ్ నుండి చాలా కాలం తర్వాత మంచి చిత్రమొచ్చింది అనే భావన కలిగించాడు. వరస ప్లాపుల నుండి బయటపడేసిన ఈ చిత్రంలో తేజ్ తన పేరు నుండి ధరమ్ ను తీసేసాడు.

చిత్రలహరి టైటిల్ కార్డ్స్ లో సాయి తేజ్ అనే పడుతుంది. ఇప్పుడు తేజ్ చేస్తోన్న ప్రతిరోజూ పండగే చిత్రానికి సాయి తేజ్ అనే టైటిల్  కార్డ్స్ లో వేస్తారు. ఇప్పటికే పబ్లిసిటీలో ఎక్కడ చూసినా ధరమ్ అన్నది లేకుండా సాయి తేజ్ అనే వేస్తున్నారు. ఇంతే అనుకుంటే తేజ్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. టైటిల్ పోస్టర్స్ లో కూడా సాయి తేజ్ అనే వేస్తున్నారు. సో, ఈ చిత్రానికి కూడా అదే పేరుని ఫాలో అవుతున్నారు. అంటే దీన్ని బట్టి తేజ్ ఇక ధరమ్ ను దూరం చేసుకున్నట్టే అనుకోవచ్చు. చిత్రలహరి డీసెంట్ గా ఆడుతుండడంతో ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు, అదే తర్వాత ఏదైనా సినిమా ప్లాప్ అయితే సాయి కూడా తీసేసి తేజ్ అని ఉంచుకుంటాడా? అయినా సాయి ధరమ్ తేజ్ తో టైటిల్స్ పడినప్పుడు హిట్స్ రాలేదా ఏంటి అంటూ కొంతమంది పెదవి విరుస్తున్నారు. అయినా అది అతని పేరు అతని ఇష్టం. మధ్యలో మీకేంటి నొప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు లెండి.