యంగ్ మెగా హీరో మంచి సినిమాలే చేస్తాడట!యంగ్ మెగా హీరో మంచి సినిమాలే చేస్తాడట!
యంగ్ మెగా హీరో మంచి సినిమాలే చేస్తాడట!

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు తన లుక్స్ పై భారీగా కామెంట్స్ వచ్చాయి. తేజ్ మొహం మీదే నువ్వేం హీరో అని అడిగిన సందర్భాలు ఉన్నాయని తనే ఒప్పుకున్నాడు కూడా. అయితే తొలి సినిమా నుండి కష్టపడుతూ మిడ్ రేంజ్ కు అనతికాలంలోనే చేరుకున్నాడు తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ ఇలా వరసగా హిట్ సినిమాల్లో నటించడంతో తేజ్ మిడ్ రేంజ్ హీరోలలో టాప్ స్థాయికి చేరుకుంటాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరస ప్లాపులు తేజ్ కెరీర్ ను డీలా పడేలా చేసేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు ప్లాపవ్వడంతో తేజ్ పూర్తిగా డీలా పడ్డాడు. అతని మార్కెట్ కూడా బాగా దెబ్బతింది. సాధారణంగా మెగా హీరోలకు ప్లాపులు తక్కువే ఉంటాయి. అలా అని ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. కానీ తేజ్ కు వరసగా ప్లాపులు రావడంతో బాగా డౌన్ అయిపోయాడు. అదే సమయంలో వరుణ్ తేజ్ వంటి హీరోలు వరస హిట్లతో దూసుకుపోవడంతో సొంత క్యాంప్ నుండే పోటీ వాతావరణం పెరిగిపోయింది.

అయితే ఈ ప్లాపులకు చిత్రలహరి బ్రేకిచ్చింది. వరస ప్లాపుల నుండి కొంత ఊరట కలిగించింది. ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమా రిలీజ్ సన్నాహకాల్లో ఉన్నాడు తేజ్. ఈ చిత్ర ప్రమోషన్స్ ను చేస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. కామెడీ ఎంటెర్టైనెర్స్ కు పెట్టింది పేరైన మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు కూడా బాగున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తోంది. ఈ సినిమా విడుదలవ్వకుండానే తేజ్ తన నెక్స్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ ను మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మరో ఆసక్తికర పాయింట్ తో ఉంటుందని తెలుస్తోంది. మే 1న ఈ సినిమా విడుదలవుతుంది. నభ నటేష్ ఇందులో కథానాయిక. పై రెండు సినిమాలకు కూడా థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

ప్రతిరోజూ పండగే చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గతంలో కథల ఎంపికలో చాలానే తప్పులు చేసానని, అయితే ఇప్పుడు మంచి సినిమాలే చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు తేజ్. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేసాడు. అలాగే ప్రతిరోజూ పండగే కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు. చూడాలి మరి తేజ్ కెరీర్ ఈ సినిమాల తర్వాత ఎటువంటి టర్న్ తీసుకోనుందో!