బన్నీ కోసం తేజ్ త్యాగం చేయక తప్పలేదుగాబన్నీ కోసం తేజ్ త్యాగం చేయక తప్పలేదుగా
బన్నీ కోసం తేజ్ త్యాగం చేయక తప్పలేదుగా

మెగా ఫ్యామిలీ నుండి దాదాపు 9 మంది హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ఏ ఫ్యామిలీలో కూడా ఇంత మంది హీరోలను చూడం. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇప్పుడు యాక్టివ్ గా సినిమాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు ఉన్నాయి కాబట్టి అతణ్ణి కూడా కలుపుకుంటే సంఖ్య 9కు చేరుకుంది. దీంతో ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు ఇప్పుడు చాలా యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు చొప్పున వారి సినిమాలు విడుదలవుతున్నాయి. దీని వల్ల ఒకరి సినిమాలు మరొకరి సినిమాలతో క్లాష్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

ఒకవేళ ఇలా క్లాష్ అయ్యే పక్షంలో చిన్న హీరోల సినిమాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పూర్తి చేసిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు ఇది పండక్కి రావాల్సిన సినిమా అన్న భావనను వ్యక్తం చేసారు. చాలా ఆహ్లాదంగా, పల్లెటూరు వాతావరణంలో, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సంక్రాంతికి వస్తే మంచి కిక్కిస్తుంది అన్న భావన అందరూ వ్యక్తం చేసారు.

అయితే ఈ ఫీలింగ్ ప్రతిరోజూ పండగే టీమ్ కు రాకుండా ఉండుంటుందా? కానీ సంక్రాంతికి రాకపోవడానికి ప్రధాన కారణం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. మరో ఏ సినిమా అయినా కూడా తేజ్ తన చిత్రాన్ని పోటీగా నిలబెట్టేసేవాడు. కానీ అవతల తన ఫ్యామిలీ సినిమా కూడా కాబట్టి తేజ్ వెనక్కి తగ్గక తప్పలేదు. నిజానికి ఈ రెండు చిత్రాలకు నిర్మాత అల్లు అరవింద్ కావడం విశేషం. దాంతో అల వైకుంఠపురములో చిత్రాన్ని సంక్రాంతికే సెట్ చేసి, ప్రతిరోజూ పండగేను డిసెంబర్ 20కి సెట్ చేసారు.

అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలైతే చాలా ప్లస్ అవుతుంది. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడంతో కచ్చితంగా సంక్రాంతికి వస్తేనే బడ్జెట్ రికవర్ అవుతుంది. అయితే ప్రతిరోజూ పండగే కూడా సంక్రాంతికి వస్తే అంత బడ్జెట్ లేకపోయినా కలెక్షన్స్ పెరుగుతాయి, తద్వారా మార్కెట్ కూడా పెంచుకోవచ్చు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు ఈ ఇబ్బంది వస్తోంది. చాలా ముఖ్యమైన డేట్లను తమ మెగా హీరోలకోసమే త్యాగం చేస్తున్నారు. సైరా – గద్దలకొండ గణేష్ చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ప్రతిరోజూ పండగే – అల వైకుంఠపురములో విషయంలో కూడా ఇదే జరుగుతోంది.